Valentine's Day : లవర్స్ డే కోసం పాత సినిమాల వెల్లువ

Byline :  Babu Rao
Update: 2024-02-13 11:08 GMT

ఒకప్పుడు వాలెంటైన్స్ డే అంటే మంచి లవ్ స్టోరీ ఉన్న సినిమాలు విడుదలయ్యేవి. బట్ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రేమికుల రోజు అనే కాదు.. ఏ అకేషన్ వచ్చినా.. ఆ సందర్భానికి తగ్గట్టుగా పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నాడు. అలా ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ఏకంగా ఎనిమిది సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. వీటిలో హాలీవుడ్ టైటానిక్ నుంచి రీసెంట్ గా వచ్చిన బేబీ వరకూ ఉంటం విశేషం. ఇవన్నీ ప్రేమకథలుగానే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచిన సినిమాలు కావడం.. తెలుగు మాత్రమే కాక తమిళ్ డబ్బింగ్ సినిమాలను కూడా విడుదల చేస్తుండటం మరో విశేషం.

తెలుగు నుంచి దుల్కర్ సాల్మన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సీతారామం విడుదలవుతోంది. హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2022 ఆగస్ట్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. సెన్సిబుల్ లవ్ స్టోరీగా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన తెచ్చుకుని.. ఈ మధ్య కాలంలో వచ్చిన గ్రేట్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిలిచింది సీతారామం. ప్రేమికుల రోజు సందర్భంగా సీతారామంనుం మళ్లీ విడుదల చేస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ కు యూత్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చిన తొలిప్రేమను సైతం రీ రిలీజ్ చేస్తున్నారు. కీర్తిరెడ్డి హీరోయిన్ గా నటించిన ఈమూవీతోనే కరుణాకరన్ దర్శకుడుగా పరిచయంం అయ్యాడు. అప్పట్లో లవ్ స్టోరీస్ లో ఓ ట్రెండ్ ను సెట్ చేసిన ఈ మూవీకి ఇప్పటికీ మంచి ఫ్యాన్స్ ఉన్నారు.

చాలా చిన్న సినిమాగా వచ్చి ఎవరూ ఊహించని రేంజ్ లో ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా బేబీ. ఈ సినిమా సాధించిన విజయాన్ని బట్టి కల్ట్ బొమ్మ అనే ట్యాగ్ లైన్ మేకర్సే ఇచ్చుకున్నారు. కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ కాలం ప్రేక్షకులకు తగ్గట్టుగా ఉన్న ఈ మూవీ కూడా మరోసారి వేలెంటైన్స్ డే సందర్భంగా సందడి చేయబోతోంది. దీంతో పాటు సిద్ధార్థ్, షామిలీ జంటగా నటించిన ఓయ్ కూడా విడుదల కాబోతోంది.

ఇక డబ్బింగ్ సినిమాలుగా వస్తోన్న వాటిలో హాలీవుడ్ క్లాసిక్ టైటానిక్ తో పాటు హిందీ ఎవర్ గ్రీన్ మూవీ దిల్ వాలే దుల్హనియో లేజాయేంగే ఉన్నాయి. తమిళ్ నుంచి సూర్య, సిమ్రన్, సమీరా రెడ్డి, దివ్య స్పందన ప్రధాన పాత్రల్లో గౌతమ్ మీనన్ తెరకెక్కించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో తమిళ్ లో వచ్చిన ది గ్రేట్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా చెప్పుకున్న ‘96’ను కూడా ప్రేమికుల రోజు సందర్భంగా మరోసారి విడుదల చేస్తున్నారు. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం అక్కడ క్లాసిక్ అనిపించుకుంది. మరి ఈ ప్రేమకథల్లో మళ్లీ ప్రేమికులకు కనెక్ట్ అయ్యి కలెక్షన్స్ సాధించే సినిమాలేంటనేది చూడాలి.

Tags:    

Similar News