Saindhav Movie Teaser: సైంధవ్ టీజర్.. ఇంతకు ముందెప్పుడూ కనిపించని వెంకీ..

By :  Babu Rao
Update: 2023-10-16 07:15 GMT

విక్టరీ వెంకటేష్ అంటే ఒక ఇమేజ్ ఉంది. ఆయన ఏ సినిమా చేసినా క్లాస్ ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తారు. ముఖ్యంగా, ఫ్యామిలీ, లేడీస్ లో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న స్టార్ వెంకటేష్. అప్పుడప్పుడూ మాస్ మూవీస్ చేసినా వెంకీ ప్రధాన బలం ఫ్యామిలీ ఆడియన్సే. ప్రస్తుతం కెరీర్ లో 75వ సినిమాగా సైంధవ్ తో వస్తున్నాడు వెంకటేష్. ఈ మూవీ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కథ విషయంలో పర్టిక్యులర్ గా ఉన్నాడు. ఈ క్రమంలో తెలుగులో వరుసగా హిట్, హిట్2 అనే చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సైంధవ్ మూవీ చేయడానికి సంతకం చేశాడు. ఈ మూవీ ఆరంభం నుంచీ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది. షూటింగ్ స్టార్ట్ అయిన టైమ్ లోనే విడుదల చేసిన వీడియోతో వెంకీ చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తుున్నాడన్న విషయం చెప్పారు. ఇక లేటెస్ట్ గా వచ్చిన టీజర్ చూస్తే ఇది వెంకటేష్ ఇప్పటి వరకూ చేయని కథలా ఉంది.

సౌత్ ఇండియాలోని చంద్రప్రస్థ అనే ప్రాంతంలో భార్య, కూతురుతో కలిసి హ్యాపీగా ఉంటాడు వెంకీ. సడెన్ గా ఫ్రేమ్ నుంచి భార్య మాయమవుతుంది. కట్ చేస్తే అతి కౄరమైన గ్యాంగ్ స్టర్ ముఠా ఎంట్రీ ఇస్తుంది. వికాస్(నవాజుద్దీన్ సిద్ధిఖీ)కి ఓ పెద్ద బాధ్యత ఇస్తారు. అతను వరుసగా క్రూరమైన హత్యలు చేస్తూ ఆ బాధ్యత నెరవేరుస్తుంటాడు. ‘20వేలమంది పిల్లలకు గన్స్ ట్రెయినింగ్ ఇచ్చిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కు డెలివర్ చేస్తున్నారు.. దీన్ని ఆపాలి‘ అన్న నేవీ ఆఫీసర్ మాటలు, ఆ క్రమంలో కనిపించే షిప్ లలోని డ్రగ్స్, డబ్బును బట్టి ఇది సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాగే కథ అని అర్థం అవుతుంది. ఇక ఈ మారణహోమాన్ని ఆపడానికి అంత క్రూరమైన విలన్స్ కూడా భయపడే సైంధవ్ రంగంలోకి దిగుతాడు. ఒక్కొక్కరినీ ఊచకోత కోస్తుంటాడు. చివర్లో విలన్ కు వార్నింగ్ ఇస్తూ.. ‘‘వెళ్లే ముందు చెప్పి వెళ్లా.. విన్లేదు. అంటే భయం లేదు. లెక్క మారుద్దిరా నా కొడకల్లారా’’ అంటూ వెంకటేష్ చెప్పే డైలాగ్ ను బట్టి.. ఆ వెళ్లడానికి ముందు ఏం జరిగింది.. వీళ్లెందుకు అతను తిరిగి వస్తాడని భయపడుతున్నారు.. అసలు వీరి మధ్య రిలేషన్ ఏంటీ అనే ప్రశ్నలను వదిలేశాడు దర్శకుడు. ఇవన్నీ చాలా ఆసక్తిగానే ఉన్నాయి. సినిమాపై అంచనాలు పెంచేలానే ఉందీ టీజర్.

ఇక క్రిస్మస్ నుంచి సలార్ కారణంగా వాయిదా పడిన సైంధవ్ ను సంక్రాంతి బరిలో నిలిపారు. 2024 జనవరి 13న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. వెంకీతో పాటు నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీశర్మ, ఆండ్రియా జెర్మియా, ముఖేష్ రుషి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నాడు. తమిళ్ మ్యూజీషియన్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు.

మొత్తంగా వెంకటేష్ నుంచి ఈ రేంజ్ లో బ్లడ్ షెడ్ మాస్ యాక్షన్ ను ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. దీనికి బలమైన కంటెంట్ కూడా తోడైతే ఖచ్చితంగా విక్రమ్ రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక సంక్రాంతి బరిలో దిగడం రిస్క్ అనుకున్నవాళ్లందరూ ఈ టీజర్ చూసిన తర్వాత అభిప్రాయం మార్చుకుంటారని కూడా చెప్పొచ్చు.

Tags:    

Similar News