నా పెళ్లి విషయమేమీ బెర్ముడా ట్రయాంగిల్ కాదు.. హీరో విశాల్
తమిళ స్టార్ హీరో ‘విశాల్’ పెళ్లిపై గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. హీరోయిన్ లక్ష్మీ మీనన్‌తో విశాల్ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే వీరి పెళ్లి అంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. ఈ పెళ్లి వార్తలపై విశాల్ టీం స్పందించింది. విశాల్, లక్ష్మీ మీనన్ పెళ్లి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పుకొచ్చింది. తాజాగా తన పెళ్లి వార్తలపై స్వయంగా విశాల్ స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న పెళ్లి వార్తను పూర్తిగా ఖండిస్తున్నాను అని ఓ ట్వీట్ చేశారు.
‘సాధారణంగా నేను సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్, రూమర్స్ గురించి స్పందించను. . అనవసరం అనుకుని వదిలేస్తాను. కానీ, ఈసారి స్పష్టత ఇవ్వాల్సి వస్తుంది. లక్ష్మీ మీనన్ తో నా వివాహం అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఇందులో ఏ నిజం లేదు. నేను ఇప్పుడు స్పందించడానికి ఓ కారణం ఉంది. లక్ష్మీ మీనన్ నటిగా కంటే.. ఓ అమ్మాయి. మీరు ఒక అమ్మాయి వ్యక్తిగత జీవితం గురించి ఇలా చెప్పి తన ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు. ఆమె ఇమేజ్‌ను కించపరిచారు. సంవత్సరం, తేదీ, సమయం భవిష్యత్తులో నేను ఎవరిని వివాహం చేసుకోబోతున్నాననే విషయాలను డీకోడ్ చేయడానికి ఇది బెర్ముడా ట్రయాంగిల్ కాదు. సమయం వచ్చినప్పుడు నా పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటిస్తా’ అని విశాల్ పేర్కొన్నారు.
ప్రస్తుతం విశాల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి తన పెళ్లి వార్తలపై స్పందించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు. విశాల్, లక్ష్మీ మీనన్ కలిసి పాండియనాడు (పల్నాడు), ఇంద్రుడు సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాల్లో విశాల్‌తో ఆమె కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఆపై వీరిద్దరూ ఏ సినిమాలోనూ నటించలేదు. విశాల్ ప్రస్తుతం మార్క్ ఆంథోని చిత్రంలో నటిస్తున్నారు.