Vivek Agnihotri: ప్రభాస్‌తో పోటీపడాలని.. చివరకు బోల్తాపడ్డ బాలీవుడ్ డైరెక్టర్

Update: 2023-10-03 04:40 GMT

‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.. వారం రోజుల కిందట 'ది వ్యాక్సిన్ వార్' అనే సినిమాను విడుదల చేశాడు. కోవిడ్ నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీ కోసం ఇండియన్ సైంటిస్టులు పడ్డ కష్టాలు, మరి కొన్ని కోణాల ఇతివృత్తంగా ఈ వ్యాక్సిన్ వార్ తెరకెక్కించారు. కశ్మీర్ ఫైల్స్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో భారీ అంచనాల నడుమ ఈ సినిమా రిలీజ్ అయింది. కానీ తొలిరోజు రూ.1.3 కోట్లు మాత్రమే వసూలు చేసి మిక్స్ డ్ టాక్ కు పరిమితమైంది ఈ మూవీ.

కాగా.. ఆదిపురుష్ సినిమా విషయంలో ప్రభాస్ ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద కామెంట్స్ చేసిన వివేక్.. సలార్ కి పోటీగా వాక్సిన్ వార్ ని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కశ్మీర్ ఫైల్స్ కూడా.. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ కి పోటీగా రిలీజ్ చేశాడు. పాన్ ఇండియా సినిమాలకు పోటీగా విడుదలై కశ్మీర్ ఫైల్స్ మూవీ రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసి ట్రేడ్ కు షాక్ ఇచ్చింది. దీంతో ‘ది వాక్సిన్ వార్’తో మరో సంచలనం క్రియేట్ చేద్దామనుకున్నాడు. అందుకే ఈసారి ప్రభాస్ మరో సినిమా 'సలార్'ని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచాడు. సలార్ రిలీజ్ డేట్ రోజునే (సెప్టెంబర్ 28న) ది వాక్సిన్ వార్ కూడా రిలీజ్ అని అనౌన్స్ చేసి షాకిచ్చాడు.

కానీ.. ఊహించని విధంగా సలార్ మూవీ సెప్టెంబర్ 28 నుండి వాయిదా పడటంతో ... వాక్సిన్ వార్ పోటీ లేకుండా రిలీజ్ అయ్యింది. అదే మైనస్ అయ్యిందంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్. ది వ్యాక్సిన్ వార్ సినిమాకు 5 రోజుల్లో 8 కోట్లు కూడా రాలేదు. మొదటి 2 రోజులు కోటి కూడా రాలేదు. సలార్ సినిమాకు పోటీగా రిలీజ్ అయ్యి ఉండి ఉంటే ..అసలు ఈ సినిమా గురించి కొద్దో గొప్పే మాట్లాడేవారు అంటున్నారు. అయితే సలార్ వలనే ది వ్యాక్సిన్ వార్ పోయిందని చెప్పుకునేందుకు మాత్రం వీలుండేదని కొందరు కామెంట్ చేయటం గమనార్హం. సినిమా గొప్ప కంటెంట్ తో ఉన్నా అంత పరమ బోరింగ్ సినిమాను ఎప్పుడు చూడలేదు అని వివేక్ అగ్నిహోత్రిని ట్రోల్ చేస్తున్నారు.

మరోవైపు వివేక్ అగ్నిహోత్రి ఈ మూవీటాక్ గురించి స్పందిస్తూ.. సినిమా చూసిన 90 శాతం మంది గర్వంగా బయటకు వస్తున్నారన్నారు. ఒక్కరు కూడా సినిమాకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదన్నారు. గొప్ప సినిమా చూశాం.. ఒకే సారి నవ్వు, కన్నీళ్లను సినిమా ఇస్తోందన్నారు. ఫలితం ఎలా ఉన్నా సినిమా చూసిన ఒక్కరు కూడా నెగెటివ్ రివ్యూ రాయలేదని తెలిపారు. సినిమా విషయంలో ప్రతి ఒక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుందన్నారు.

Tags:    

Similar News