Dadasaheb Phalke Award : ‘వహీదా రెహమాన్’కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

Update: 2023-09-26 09:05 GMT

బాలీవుడ్ లెజెండ‌రీ న‌టి, డ్యాన్సర్ వహీదా రెహమాన్ (Waheeda Rehman)కు ‘దాదా సాహెబ్‌ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం’ (Dada Saheb Phalke Lifetime Achievement Award) వరించింది. ఈ ఏడాది ఈ పురస్కారానికి ఆమె ఎంపికైనట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మంగళవారం ప్రకటించారు. భారతీయ సినీ పరిశ్రమకు 5 దశాబ్దాలుగా సేవలు అందించినందుకు గాను ఆమె ఈ అవార్డుకు ఎంపికయ్యారు.వహీదా రెహమాన్ వ‌య‌సు 85 ఏళ్లు. 69వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ కార్య‌క్ర‌మంలో వహీదాకు ఫాల్కే అవార్డును అంద‌జేయ‌నున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు క‌మిటీలోని అయిదుగురు స‌భ్యులు వహీదా రెహమాన్ పేరును ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు.

హిందీలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు వహీదా. 1955లో రోజులు మారాయి తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు వహీదా రెహమాన్‌. ఈ చిత్రంలోని ‘ఏరువాక సాగారో రన్నో..’ పాట ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత 1956లో సీఐడీ (CID) చిత్రంతో బాలీవుడ్‌ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆమె ఎక్కువగా హిందీ సినిమాల్లోనే నటించారు. హిందీలో నటించిన ఆమె చిత్రాలలో తన పాత్రలకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ప్యాసా, కాగజ్ కే ఫూల్, చౌదవి కా చాంద్, సాహెబ్ బీవీ ఔర్ గులామ్, గైడ్, ఖామోషి చిత్రాలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఐదు దశాబ్దాల కాలంలో అన్ని భాషల్లో కలిపి మొత్తం 90కు పైగా చిత్రాల్లో నటించారు. 1971లో ఉత్తమ నటిగా వహీదా జాతీయ అవార్డును అందుకున్నారు. 1972లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్‌ పురస్కారాలు వరించాయి.

వహీదా ప్రస్తుతం ముంబై లో నివసిస్తున్నారు. వహీదా రెహమాన్ 1974లో శశిరేఖిని ని వివాహం చేసుకున్నారు. శశి రేఖిని కమల్జీత్ అని కూడా పిలుస్తారు. ఆయన కూడా నటుడే.. హిందీలో పలు సినిమాల్లో నటించాడు. 21 నవంబర్ 2000న కమల్జీత్ మరణం తర్వాత వహీదా ముంబైలో తన పిల్లతో కలిసి ఉంటున్నారు.

Tags:    

Similar News