Jacqueline Fernandez : వెన్నుపోటు పొడిచావ్'..జాక్వెలిన్‌ను బెదిరిస్తూ సుకేశ్ లేఖ
'నువ్వే నా రాణి, ప్రతీ సెకను నీ గురించే ఆలోచిస్తున్నా... నిన్ను చాలా మిస్ అవుతున్నా...' అంటూ మొన్నటి వరకూ బాలీవుడ్ నటి జాక్వెలిన్‌కు ప్రేమలేఖలు రాసిన ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ తాజాగా మరో లేఖ రాసినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ప్రేమతో కాకుండా.. తమ మధ్య ఏం జరిగిందో ప్రపంచానికి చెబుతానంటూ బెదిరిస్తూ లెటర్ రాశాడు. అయితే ప్రియురాలిని పిచ్చిగా ప్రేమించిన సుకేశ్.. ఈ లెటర్ రాయడానికి వెనుక ఓ కారణముంది. అదేంటంటే...
సుకేశ్‌తో తనకెలాంటి సంబంధం లేదని, అతను తనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జాక్వెలిన్. సుకేశ్ తనను ట్రాప్ చేశాడని, తనపై ఉన్న కేసును కొట్టివేయాలని అభ్యర్థించింది. దీంతో ఆ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలంటూ ఈడీని కోర్టు ఆదేశించింది. ఈళ పిటిషన్ గురించి తెలుసుకున్న సుకేశ్.. ఆమెపై ఫైర్ అయ్యాడు. ఆమె పేరును ప్రస్తావించకుండా ఓ లెటర్ రాస్తూ... అందులో ‘‘నేను చాలా దిగ్భ్రాంతికి గురయ్యా. ఎవరినైతే (జాక్వెలిన్‌ను ఉద్దేశిస్తూ) భద్రంగా చూసుకోవాలనుకున్నానో.. వారే ఇప్పుడు ఎదురుతిరిగారు. వెన్నుపోటు పొడిచారు. బాధితులుగా పేర్కొంటూ నిందలు వేయడం మొదలుపెట్టారు. నన్ను చెడ్డవాడిగా చూపించాలనుకుంటున్నారు. ఇది నేను కలలో కూడా ఊహించలేదు. హృదయం ఉన్నది ముక్కలవడం కోసమేనని ఇప్పుడు అర్థమైంది. ఇక నాకు వాస్తవాలను బయటపెట్టడం తప్ప మరో అవకాశం లేదు’’ అంటూ ముగించాడు. ఈ లెటర్ జాక్వెలిన్‌ను ఉద్దేశించి రాసినట్లు సుకేశ్ తరఫు లాయర్ మీడియాకు తెలిపారు.
‘‘ఆ వ్యక్తిని (జాక్వెలిన్) రక్షించేందుకు ఇన్నాళ్లూ రహస్యంగా దాచి ఉంచిన ఆధారాలన్నీ బయటపెడతా. ఇద్దరి మధ్య చాట్, స్క్రీన్‌షాట్లు, రికార్డింగులు, విదేశీ ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు.. అన్నింటి గురించి చెబుతా. ఆ వ్యక్తికి సోషల్ మీడియాలో ప్రచారం కల్పించేందుకు మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టా. అందుకు సంబంధించిన ఇన్వాయిస్‌లను బయటపెడతా. ఈ వాస్తవాలను ప్రపంచం తెలుసుకోవాలి’’ అని సుకేశ్ తన లేఖలో బెదిరించినట్లు తెలుస్తోంది.