ఏపీలో నేటి నుంచి ఒంటిపూట బడులు.. ఎప్పటివరకంటే..
మొదటిరోజే విద్యార్థులకు 'జగనన్న విద్యాకానుక';
ఏపీలో వేసవి సెలవులు తర్వాత నేటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. అయితే భానుడి భగభగలు ఏమాత్రం తగ్గకపోవడంతో.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17వ తేదీ వరకూ ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులు ఉంటాయని, ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు స్కూళ్లు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు ఈ నిబంధన వర్తించనుంది. జూన్ 19 నుంచి విద్యా ప్రణాళిక షెడ్యూల్ ప్రకారం బడులు పూర్తిస్థాయిలో నడుస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
19 నుంచి మామూలుగానే..
రాబోయే నాలుగైదు రోజుల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్న ఐఎండీ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థల ముందస్తు సూచనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం 8.30 నుంచి 9 గంటల మధ్య రాగి జావ, ఉదయం 11.30 నుంచి 12 గంటల మధ్య మధ్యాహ్న భోజనం పెట్టాలని ఆ ఉత్తర్వుల్లో వివరించారు. 19వ తేదీ నుంచి 2023-24 విద్యా ప్రణాళికలోని షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు పనిచేస్తాయని తెలిపారు.
విద్యాకానుక కిట్ల పంపిణీ నేటి నుంచే
ఇక ఈ రోజే వరుసగా నాలుగో ఏడాదీ జగనన్న విద్యాకానుకను అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి చదివే 43,10,165 మంది విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో విద్యాకానుక కిట్ల పంపిణీని సీఎం వైఎస్ జగన్ సోమవారం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. 2023–24 విద్యా సంవత్సరం సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో మొదటిరోజే విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. కిట్‌లో స్కూలు పుస్తకాల బ్యాగ్‌తో పాటు మూడు జతల యూనిఫామ్ క్లాత్, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, డిక్షనరీ ఉంటాయన్నారు.