Chiranjeevi : అమెరికాలో చిరంజీవికి ఘన సన్మానం

Byline :  Vijay Kumar
Update: 2024-02-19 09:48 GMT

మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అమెరికా పర్యటనలో ఉన్న మెగాస్టార్ చిరంజీవిని అక్కడి అభిమానులు ఘనంగా సన్మానించారు. అమెరికాలోని మెగా ఫ్యాన్స్ లాస్ ఏంజెల్స్ నగరంలో మెగా ఫ్యాన్స్ చిరంజీవికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. లాస్ ఏంజెల్స్ లోని రిట్జ్ కార్ల్ టన్ డ్రైవ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అమెరికాలోని చిరు అభిమానులు భారీగా తరలివచ్చారు. అమెరికా గడ్డపై తన అభిమానులను చూసి చిరంజీవి ముగ్ధులయ్యారు. సత్కారం అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. తనకు వచ్చిన అవార్డును చూసి అభిమానులు అది తమకే వచ్చినంతగా సంబరపడుతున్నారని తెలిపారు.

అవార్డు వచ్చినప్పుడు, గుర్తింపు లభించినప్పుడు నిజంగా ఆనందమేనని, అయితే తనకు అవార్డు రావడం పట్ల ఇంత మంది ప్రతిస్పందిస్తుండడం చూసి తనకెంతో సంతోషంగా అనిపిస్తోందని చిరంజీవి పేర్కొన్నారు. ఇంతమంది తమ ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తుంటే ఇది కదా నిజమైన ఆనందం అనిపిస్తోందని అన్నారు. ఇంతకంటే అవార్డు ఇంకేముంటుందని అన్నారు. కాగా ఈ సారి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 8 మందిని పద్మ అవార్డులు వరించాయి. అందులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు పద్మ విభూషణ్ అవార్డు రాగా మిగతా ఆరుగురికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పద్మ అవార్డులకు ఎంపికన తెలుగువాళ్లను ఘనంగా సత్కరించింది. ఇక పద్మశ్రీ అవార్డు పొందిన ఆరుగురికి తలో రూ.25 లక్షల ప్రోత్సాహకం అందించింది. 

Tags:    

Similar News