ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అనుహ్య నిర్ణయం తీసుకుంది. చెన్నైకి 5 ఐపీఎల్ ట్రోఫీలు అందించిన ధోనీ కెప్టెన్ గా తన ప్రస్థానాన్ని ముగించాడు. అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా నియమించారు. తాజాగా ఐపీఎల్ ట్రోఫీతో జరిగిన ఫొటో షూట్ లో 10 జట్ల కెప్టెన్లు పాల్గొనగా.. అందులో ధోనీ స్థానంలో గైక్వాడ్ వచ్చాడు. ఈ ఏడాది నుంచి చెన్నైకి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ అని ఫ్రాంచైజీ కూడా ట్విటర్ అకౌంట్ లో అధికారికంగా ప్రకటించింది.
గత కొన్ని సీజన్స్ గా చెన్నై తరుపున ఆడుతున్న గైక్వాడ్.. ఎన్నో విజయాలను అందించాడు. దీంతో అతనిపై ఫ్రాంచైజీ నమ్మకముంచి కెప్టెన్సీ ఇచ్చింది. ఏషియన్ గేమ్స్ లో భారత సారథిగా సక్సెస్ అయిన గైక్వాడ్.. గోల్డ్ మెడల్ సాధించాడు. కాగా, కొత్త పాత్రలో కనిపించబోతున్నానని కొన్ని రోజుల క్రితమే ధోనీ తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. మరి ఈ సీజన్ లో ధోనీ పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతాడా? లేదా ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. కాగా పంజాబ్ కింగ్స్ టీంకు జితేశ్ శర్మను వైస్ కెప్టెన్ గా నియమించారు.