గుడ్‌న్యూస్ చెప్పిన ఫ్లిప్‌కార్ట్.. యూపీఐ సేవలు ప్రారంభం
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్ తమ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. యూపీఐ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకూ అమెజాన్ సంస్థ అమెజాన్ పే పేరుతో యూపీఐ సేవలను అందిస్తూ వస్తోంది. తాజాగా ఆ జాబితాలోకి ఫ్లిప్‌కార్ట్ చేరిపోయింది. యూపీఐ చెల్లింపుల రంగంలోకి అడుగుపెట్టినట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించడంతో యూజర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపై ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో యూపీఐ చెల్లింపులు చేపట్టవచ్చు. ఇప్పటి వరకూ అయితే ఫోన్ పే, గూగుల్ పే వంటి ఇతర ప్లాట్‌ఫాంల ద్వారా ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులు యూపీఐ చెల్లింపులను చేసేవారు. ఇప్పుడు తాజాగా యాక్సిస్ బ్యాంకు సహకారంతో ఫ్లిప్‌కార్ట్ యూపీఐ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో యూపీఐ ఐడీని క్రియేట్ చేసుకుంటే సరిపోతుందని ఆ సంస్థ తెలిపింది.
ప్రస్తుతం యూపీఐ సేవలు ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తెచ్చామని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. గత ఏడాది నుంచే యూపీఐ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్ ప్రయత్నిస్తూ వస్తోంది. ఇకపోతే ఫ్లిప్‌కార్టు యూపీఐ రాకతో మార్కెట్‌లో ఉన్నటువంటి గూగుల్ పే, ఫోన్‌పే వంటి కంపెనీలకు సమస్యలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.