ఐర్లాండ్ సిరీస్‌కు భారత్ సిద్ధం..చరిత్ర సృష్టించనున్న బుమ్రా

Update: 2023-08-16 12:28 GMT

టీమిండియా ఐర్లాండ్‌తో టీ20 సమరానికి సిద్ధమవుతోంది. ఐర్లాండ్ సిరీస్‌లో భారత్ మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడనుంది. టీ20 సిరీస్ ఆగస్టు 18న డబ్లిన్‌లోని మలాహిడ్‌లో ప్రారంభమవుతుంది. సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లు ఆగస్టు 20 , 23 తేదీల్లో ఇదే వేదికపై జరుగుతాయి.

ఐర్లాండ్‌ సిరీస్‌కు కీలక బౌలర్ బుమ్రా నేతృత్వంలో యువ జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. గాయం కారణంగా దీర్ఘకాలంగా ఆటకు దూరంగా ఉన్న బుమ్రా ఈ సిరీస్ ద్వారా పునరాగమనం చేస్తున్నాడు. బుమ్రా సెప్టెంబర్ 2022 నుండి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. 15 ఏళ్లుగా టీ20లు జరుగుతున్నా ఇప్పటివరకు ఒక్క బౌలర్ కూడా ఈ ఫార్మాట్‌లో టీమిండియాకు నాయకత్వం వహించలేదు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు 10 మంది భారత్‌కు సారథ్యం వహించారు. అయితే వారిలో ఒక్కరు స్పెషలిస్ట్ బౌలర్ లేడు. ఇప్పుడు బుమ్రా పగ్గాలు అందుకోవడం ద్వారా రికార్డు సృష్టించాడు.




 


ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ లాంటి టోర్నీలను దృష్టిలో ఉంచుకుని కీలక ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి కల్పించింది. దీంతో ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు యువ క్రికెటర్లకు చోటు దక్కింది. ఈ ఏడాది ఐపీఎల్ లాంటి మెగా లీగ్‌లో రాణించిన రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, శివం దూబె, జితేష్ శర్మ లాంటి ఆటగాళ్లు ఐర్లాండ్ సిరీస్‌తో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. అటు గాయాల నుంచి కోలుకున్న ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుంద‌ర్‌ రీ ఎంట్రీ ఇచ్చారు. వెస్టిండీస్‌పై అరంగేట్రంలోనే అద‌ర‌గొట్టిన లెఫ్ట్ హ్యాండర్లు య‌శ‌స్వి జైస్వాల్, తిల‌క్ వ‌ర్మ మరోసారి కీలకంగా మారనున్నారు.

భారత జట్టు:

జస్ప్రీత్ బుమ్రా (సి), రుతురాజ్ గైక్వాడ్ (VC), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (WK), జితేష్ శర్మ (WK), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ కృష్ణ , అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్.

 

Tags:    

Similar News