ఆడితే దేశానికి.. లేదంటే ఐపీఎల్.. అయ్యర్ కుట్ర బయటపెట్టిన NCA
టీమిండియా కుర్రాళ్లు షాట్ కట్లను ఎంచుకుంటున్నారు. కాసుల వేటలో పరిగెత్తుతున్నారు. ఆడితే దేశానికి.. లేదంటే ఐపీఎల్ వైఖరిని అనుసరిస్తున్నారు. ఇదివరకు దేశవాళీల్లో ఆడి సత్తా నిరూపించుకుంటే.. జాతీయ జట్టులో చోటు కల్పించేవారు. ఫామ్ కోల్పోయిన వారు కూడా అంతే.. దేశవాళీల్లో ఆడి తిరిగి ఫామ్ లోకి వచ్చేవారు. అయితే పొట్టి క్రికెట్ అభివృద్ధి చెంది, బీసీసీఐ ఐపీఎల్ ను ప్రవేశపెట్టాక అంతా మారిపోయింది. ఐపీఎల్ నుంచి డబ్బులు బాగా వస్తుండటంతో.. దేశవాళీల్లో ఆడేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఒకవేళ జాతీయ జట్టులో చోటు కోల్పోతే ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారే తప్ప.. రంజీల్లో ఆడదామని ఎవరికీ లేదు. ఆ విషయంలో బీసీసీఐ హెచ్చరించినా.. వారు పెడచెవిన పెడుతున్నారు. మొన్న ఇషాన్ కిషన్.. నేడు శ్రేయస్ అయ్యర్ అదే రూట్ ను ఎంచుకున్నారు. అయితే అయ్యర్ మాత్ర ఎన్సీఏకు అడ్డంగా బుక్కయ్యాడు.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి మూడు టెస్టుల్లో అయ్యర్ కు చోటు దక్కలేదు. మొదట అతనికి అయిన గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు అనుకున్నారంతా. కానీ పరుగులు చేయడంలో విఫలం అవుతున్నాడని బీసీసీఐ అతన్ని తప్పించింది. అయితే వెన్ను నొప్పి అంటూ ఎన్సీఏలో చేరిన అయ్యర్.. దాన్ని సాకుగా చూపిస్తూ రంజీ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. ఫిబ్రవరి 23 నుంచి ముంబై-బరోడా జట్ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కు అయ్యర్ అందుబాటులో ఉండడని ముంబై అసోసియేషన్ ప్రకటించింది. అక్కడే అయ్యర్ కుట్ర బయటపడింది.
ఎన్సీఏ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం.. అయ్యర్ కు ఎలాంటి గాయాలు లేవు. అతను పూర్తి ఫిట్ గా ఉన్నాడని ఎన్సీఏ నివేదికలో ఉంది. దీంతో అయ్యర్ మొండి వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ ను దృష్టిలో పెట్టుకుని.. కావాలనే అయ్యర్ ఈ నాటకం ఆడుతున్నాడని కొంతమంది చెప్తున్న మాట. దీనిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. కాగా జట్టులో స్థానం కోల్పోయిన ఆటగాడు తప్పకుండా దేశవాళీలో ఆడాలని, అలా అయితేనే ఐపీఎల్ అయినా, తిరిగి జట్టులో చోటైనా దక్కుతుందని బీసీసీఐ తేల్చి చెప్పింది.