వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ ప్రకటనకు తేదీ ఖరారు..!

Update: 2023-06-22 11:49 GMT

ప్రతిష్టాత్మకమైన ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌కు ఈ సారి భారత్ వేదికగా జరగనుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో టోర్నీ నిర్వహిస్తారు. వరల్డ్ కప్ షెడ్యూల్ కోసం చూస్తున్న సమయంలో కీలక అప్డేట్ వచ్చింది. వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ ప్రకటనకు ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈనెల 27 వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే షెడ్యూల్ విడుదలకు ఐసీసీ రంగం సిద్ధం చేసింది. వరల్డ్‌కప్‌ ప్రారంభ తేదీ అయిన అక్టోబర్‌ 5కు జూన్‌ 27 సరిగ్గా 100 రోజులు ముందుండంతో ఐసీసీ ఈ తేదీన షెడ్యూల్‌ విడుదల చేసేందుకు శ్రీకారం చుట్టింది.

టోర్నీ ఆరంభానికి చాలా రోజుల ముందే షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఐసీసీ షెడ్యూల్ విడుదల చేయలేదు. భారత్‎లో నిర్వహించే మ్యాచ్ వేదికలపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేయడం షెడ్యూల్ విడుదల ఆలస్యానికి కారణమైంది. బీసీసీఐ-పీసీబీల మధ్య ఆసియా కప్‌-2023, వన్డే వరల్డ్‌కప్‌-2023 వేదికల వ్యవహారంలో ఏకాభిప్రాయం కుదరని కారణంగా జాప్యం జరిగింది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో మ్యాచ్ ఆడేందకు పాక్ నిరాకరిస్తోంది. ఈ క్రమంలోనే ఐసీసీ పంపిన ముసాయిదా షెడ్యూల్‌కు పీసీబీ ఆమోదం తెలపలేదు. ఆసియా కప్‌ను హైబ్రిడ్‌ మోడ్‌లో నిర్వహించడంపై కూడా పీసీబీ కాబోయే ఛైర్మన్‌ జకా అష్రాఫ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్‌‌పై పాక్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News