‘విరాట్ కోహ్లీకి టెస్ట్ కెప్టెన్సీ’.. అవును అందులో తప్పేముంది : ఎంఎస్కే ప్రసాద్
భారత్ క్రికెట్ లో టెస్ట్ టీం సారథ్య బాధ్యతలపై మళ్లీ చర్చ ఊపందుకుంది. బుధవారం (జులై 12) నుంచి వెస్టిండీస్ తో జరగబోయే టెస్ట్ సిరీస్.. రోహిత్ శర్మకు కీలకం కానుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లో ఫెయిల్ అయిన రోహిత్.. ఇటు బ్యాటర్ గా, అటు కెప్టెన్ గా పనికిరాడని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా రోహిత్ ను తప్పించి మరొకరికి కెప్టెన్సీని అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ
సిరీస్ లో రోహిత్ తన ముద్ర వేయకపోతే.. కెప్టెన్సీనే కాదు, జట్టులో చోటు దక్కడం కూడా కష్టమే. ఈ క్రమంలో విరాట్ కోహ్లీకి టెస్ట్ కెప్టెన్సీని మళ్లీ అప్పగించాలని కొందరు కోరుతున్నారు. వాళ్లకు మాజీ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ వత్తాసు పలికాడు.
రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే.. తర్వాత కెప్టెన్ గా రహానే అవుతాడు. ఈ క్రమంలో రహానే బదులు కోహ్లీని కెప్టెన్ ఎందుకు చేయకూడదని ప్రశ్నించాడు. ‘విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ లో టీమిండియాను ఉన్నత శిఖరాలకు చేర్చాడు. 6 ఏళ్ల పాటు నంబర్ వన్ ర్యాంక్ లో నిలిపాడు. వరల్డ్ లో బెస్ట్ టెస్ట్ కెప్టెన్ ఎవరంటే.. టక్కన చెప్పే పేరు విరాట్ దే. రహానే జట్టులో చోటు కోల్పోయి.. మళ్లీ తిరిగొచ్చాడు. వైస్ కెప్టెన్ అయ్యాడు. ప్రస్తుతం ఇన్ ఫామ్ లో ఉన్న కోహ్లీని కెప్టెన్ చేస్తే తప్పేంటి. అతను టెస్ట్ క్రికెట్ ను శాసిస్థాడు. కోహ్లీ, రహానే తర్వాత టెస్టుల్లో కెప్టెన్సీ చేసే అర్హత పంత్ కు ఉంది. కానీ అతను మళ్లీ జట్టులోకి తిరిగి ఎప్పుడొస్తాడో చెప్పలేం. నా అభిప్రాయం ప్రకారం రోహిత్ ను తప్పిస్తే.. విరాట్ కు బాధ్యతలు అప్పగించడం ఉత్తమం’అని ఎంఎస్కే ప్రసాద్ అన్నాడు.