పసికూనపై ప్రతాపం.. భారీ తేడాతో గెలిచిన పాకిస్తాన్
ఆసియా కప్ తొలి మ్యాచ్ లో పాకిస్తాన్.. పసికూన నేపాల్ పై భారీ తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (151, 131 బంతుల్లో), ఫినిషర్ ఇఫ్తికర్ అహ్మద్ (109, 71 బంతుల్లో) చెలరేగడంతో 6 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోరు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ కు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. నేపాల్ బౌలర్లు విరుచుకు పడటంతో ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఫకర్ జమాన్ (14,20 బంతుల్లో), ఇమామ్ ఉల్ హక్ (5, 14 బంతుల్లో) తొందరగా ఔట్ అయిపోయారు.
నాలుగో వికెట్లో వచ్చిన రిజ్వాన్ (44, 50 బంతుల్లో) బాబర్ తో కలిసి స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించినా రిజ్వాన్ రన్ ఔట్ తో కాస్త నెమ్మదించింది. అఘ సల్మాన్ (5,14 బంతుల్లో) కూడా చేతులెత్తేయడంతో పాక్ 250 కూడా దాటదని అనుకున్నారంతా. తర్వాత వచ్చిన ఇఫ్తికర్, బాబర్ తో కలిసి నేపాల్ బౌలర్లకు చుక్కలు చూపించారు. టీ20 తరహా బ్యాటింగ్ చేస్తూ స్కోర్ పెంచారు. నేపాల్ బౌలర్లలో సోంపాల్ రెండు వికెట్లు తీసుకోగా.. కరణ్, లమిచనే చేరో వికెట్ పడగొట్టారు.
343 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ ఆరంభంనుంచే చేతులెత్తేసింది. పసికూనపై పాక్ బౌలర్లు ప్రతాపం చూపెట్టడంతో ఏ ఒక్క బ్యాట్స్ మెన్ 30 పరుగులు చేయలేక పోయారు. దీంతో 104 పరుగుల్లో ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో షాదబ్ ఖాన్ నాలుగు వికెట్లు తీసుకోగా.. షహీన్, హరీస్ చెరో రెండు వికెట్లు, సజీమ్, నవాజ్ తలా ఓ వికెట్ పడగొట్టారు. దీంతో 238 పరుగుల తేడాతో పాక్ భారీ విజయాన్ని నమోదు చేసింది.