చాలారోజుల తర్వాత సాయిరాజేష్ దర్శకత్వంలో వచ్చిన మూవీ బేబి. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించారు. వైష్ణవి, విరాజ్ లు ముఖ్యపాత్రలు చేశారు. ఈసినిమా ఓవర్సీస్ లో నిన్న, తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు విడుదల అయింది. వెరైటీ సినిమాలకు పెట్టింది పేరైన సాయి రాజేష్ బేబి సినిమాను ఎలా తీశాడు? ముక్కోణపు ప్రేమ కథతో అందరినీ మెప్పించాడా?
కథ:
ఆనంద్ ఓ బస్తీ యువకుడు. అతని ఎదురింటిలో ఉండే అమ్మాయి వైష్ణవి అతన్ని ప్రేమిస్తుంది. ఆనంద్ కూడా వైష్ణవిని ఇష్టపడతాడు. వీరి ప్రేమ స్కూల్లో మొదలవుతుంది. కానీ పదో తరగతి ఫెయిల్ అయిన ఆనంద్ ఆటో డ్రైవర్ అవుతాడు. వైష్ణవి మాత్రం ఇంటర్ పూర్తి చేసి బీటెక్ కాలేజీలో జాయిన్ అవుతుంది. అక్కడ వైష్ణవికి ఓ ధనవంతుడి కొడుకు విరాజ్ పరిచయం అవుతాడు. మొదట్లో ఫ్రెండ్స్‌గా దగ్గరవుతారు. ఆ తర్వాత పబ్బులో రొమాన్స్ చేస్తారు. ఓ కారణంగా 31 రోజుల పాటు డేటింగ్ కూడా చేస్తారు. ఈ విషయం ఆనంద్‌కు తెలిసిందా? తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడు? ఇద్దరిలో వైష్ణవి ప్రేమించిదెవరిని? బస్తీలో పుట్టి పెరిగిన వైష్ణవి పబ్ కల్చర్ కు ఎలా అలవాటు పడింది? వైష్ణవి చేసిన ఒక తప్పు ఆమె జీవితాన్ని ఎలా నాశనం చేసింది? వైష్ణవి, ఆనంద్, విరాజ్‌ల ట్రైయాంగిల్ లవ్‌స్టోరికి ఎలాంటి ముగింపు ఇచ్చారు అంటే సినిమాను చూడాల్సిందే.
ఈ తరం యువతీయువకుల్లో చాలా మంది ఈజీగా ప్రేమలో పడుతున్నారు. అయితే ఆ ప్రేమ ఒకరికి మాత్రమే పంచడం లేదు. ఒకరికి తెలియకుండా మరొకరితో రిలేషన్‌లో ఉంటూ చివరికి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదే కాన్సెప్ట్‌తో తీసిన సినిమా బేబీ. ప్రస్తుతం జరుగుతున్న, చదువుతున్న వార్తలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీశారు దర్శకుడు సాయి రాజేష్. పాఠశాల, కాలేజీల్లో ఈతరం ప్రేమ కథలు ఎలా ఉంటున్నాయి ? తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న తప్పులు ఎక్కడికి దారితీస్తున్నాయి? మన చుట్టూ ఉండే స్నేహితులు, పరిస్థితుల ప్రభావం తెలియకుండానే మనపై ఎలా పడతాయి? లాంటి విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు.
సినిమా ఈరోజు విడుదల అయింది కానీ దీని పాటలు ఎప్పటి నుంచో ప్రజల నోళ్ళల్లో నానుతున్నాయి. టీజర్, ట్రైలర్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి వారి అంచనాలకు తగ్గట్టు బేబి మూవీ ఆకట్టుకుందో లేదో చూద్దాం. వరుస రెండు ఫ్లాప్లతో డౌన్ లో ఉన్న ఆనంద్ దేవరకొండకు ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందా అని వస్తున్న ప్రశలకు సమాధానం ఎస్ డెఫినిట్లీ అంటున్నారు. యువతరానికి బేబి మూవీ బాగా కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు. మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది బేబీ ట్రైలర్ ఆరంభంలో రాసిన కొటేషన్ ఇది. ఈ మాటకు తగ్గట్లుగానే సినిమా సాగుతుంది. ఫస్ట్ లవ్ మీద వచ్చిన సినిమాలు ఎప్పుడూ పెద్దగా ఫెయిల్ అవలేదు. ఇప్పుడు ఈ సినిమా కూడా అవదు అంటున్నారు. సినిమాలో కనిపించే చాలా సన్నివేశాలు ఈ కాలం యువతీ యువకుల మధ్య ఉన్న ప్రేమకు.. వారి ఆలోచనా విధానాలకు అద్దం పట్టేలాగే ఉంటాయి. భగ్న ప్రేమికుడిగా ఆనంద్‌ను పరిచయం చేసిన తీరు, అతని కోణం నుంచి అసలు కథను ఆరంభించడం బాగుంది. అక్కడి నుంచి ఇరవై నిమిషాల పాటు వైష్ణవి - ఆనంద్‌ల స్కూల్ డేస్ ప్రేమకథే ప్రధానంగా సాగుతుంది. ఈ పాఠశాల ప్రేమకథ సహజత్వంగా సాగింది. అయితే కొంచెం ఎక్కువ సాగదీసారేమో అని కూడా అనిపిస్తుంది. ఎక్కువగా, అనవసరమైన సంభాషణలు రాయకుండా...ఎక్కువ సేపు మ్యూజిక్ తో, నటీనటులు ఎక్స్ ప్రెషన్స్ తో తీసిన తీరు హైలెట్ గా నిలుస్తోంది. ఆనంద్ పదో తరగతి ఫెయిల్ అవ్వడం.. వైష్ణవి పై చదువుల కోసం ఓ పెద్ద కాలేజీలో చేరడంతో కథ మలుపు తీసుకుంటుంది.
ఇంటర్వెల్ ట్విస్ట్ బావుంది. దీనివల్ల సెకండ్ హాఫ్ మీద ఇంట్రస్ట్ పెరుగుతుంది. అయితే రెండో భాంగలో కథను కాస్త సాగదీసినట్లు కూడా అనిపిస్తుంది. క్లైమాక్స్ కొంచెం భావోద్వేగంతో సాగుతుంది. అసలు కథ అంతా హీరోయిన్ వైష్ణవి కాలేజ్ లో చేరిన తర్వాతే మారుతుంది. ఆమె సిటీ లైఫ్ కు అలవాటు పడడం, అది హీరోకి నచ్చకపోవడం...ఈలోపు హీరోయిన్ వేరే అబ్బాయితో పరిచయం, ప్రేమతో కథలో మలుపులు తిరుగుతాయి. అక్కడక్కడా కొన్ని సీన్లు, హీరోయిన్ చేత ఓ బూతు మాట పలికించడం పెద్ద వాళ్ళకు కాస్త ఇబ్బంది కలిగించిన...యూత్ మాత్రం కనెక్ట్ అవుతుంది.
నటీనటులు: హీరో ఆనంద్ దేవరకొండ తన నటన ప్రతీ సినిమాకు ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. అలాగే ఈ సినిమాలో కొత్తగా కనిపించాడు. భగ్న ప్రేమికుడు, ఆటో డ్రైవర్ పాత్రల్లో దూరిపోయాడు. హీరోయిన్‌తో కెమిస్ట్రీ , క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించాడు.
యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్యకు ఇది మంచి సినిమా అయ్యే అవకాశ ఉంది. తొలి సినిమాతోనే నటనకు స్కోప్ ఉన్న పాత్ర లభించింది. బస్తీ అమ్మాయిగా, గ్లామర్ గాళ్‌గా లుక్స్‌లోనే కాదు నటనలోనే వేరియేషన్ చూపించగలిగింది. సినిమా మొత్తాని ఈమె పాత్రే కీలకం. అందుకు తగ్గట్టుగానే డైరెక్టర్ నమ్మకాన్ని వమ్మ చేయలేదు వైష్ణవి. హీరోయిన్ తండ్రిగా నాగబాబు, హీరో స్నేహితులుగా హర్ష, సాత్విక్ తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఈ సినిమాకు ప్రధాన బలం విజయ్ బుల్గానిన్ సంగీతం. మంచి పాటలతో పాటు అదిరిపోయే బీజీఎంతో సినిమా స్థాయిని పెంచాడు. సాయి రాజేశ్ సంభాషణలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. ఎమ్ఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.