కరోనా భయంతో 217 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తి!
కరోనా వస్తుందన్న భయంతో ఓ వ్యక్తి ఏకంగా 217 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు. సాధారణంగా రెండు డోస్‌లు మాత్రమే వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు సూచించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది మంది బూస్టర్ డోస్ వేయించుకున్నారు. కానీ జర్మనీకి చెందిన 62 ఏళ్ల వ్యక్తి ఏకంగా 217 సార్లు వ్యాక్సిన్ వేయించుకోవడం చూసి శాస్త్రవేత్తలు సైతం షాక్ అవుతున్నారు. 29 నెలల్లో 217డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఆ వ్యక్తిని వైద్యులు పరీక్షించారు.
అన్ని డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా అతనిలో ఎటువంటి దుష్ప్రభావాలు లేవని పరిశోధకులు కనుగొన్నారు. వారికి అది ఆశ్చర్యంగా అనిపించింది. జర్మనీలోని మాగ్డెబర్గ్ ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తిని యూనివర్సిటీ ఆఫ్ ఎర్లాంజెన్-నూరేమ్‌బెర్గ్ పరిశోధకులు పరీక్షించారు. వాస్తవంగా చెప్పాలంటే ఒకటి లేదా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్‌తో బాధపడుతున్నారు. ఈ తరుణంలో ఆయన రెండు వందల సార్లకు పైగా వ్యాక్సిన్ తీసుకోవడంతో పరిశోధకులు అతన్ని పరీక్షించడానికి ఎక్కువ ఆసక్తి చూపారు.
డాక్టర్ కిలియన్ షౌబెర్ మాట్లాడుతూ..హైపర్ వ్యాక్సినేషన్ వల్ల ఆ వ్యక్తిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని, అతని శరీరంలో వ్యాధినిరోధక శక్తి మంచి స్థాయిలో ఉందని తెలిపారు. ఇటీవలె లాన్సెట్ జర్నల్‌లో కూడా ఆ వ్యక్తికి సంబంధించిన శాస్త్రవేత్తల నివేదికను ప్రచురించారు. అప్పట్లో వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఈ మధ్య తరచూ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కీళ్లనొప్పులు, గుండెపోటు వంటివి వస్తున్నాయి. కానీ జర్మనీకి చెందిన వ్యక్తి రెండువందలకు పైగా వ్యాక్సిన్ వేయించుకున్నా అతనిలో సైడ్ ఎఫెక్ట్స్ రాకపోవడం చూసి వైద్యులతో పాటు నెటిజన్లై సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.