గాజాలో ఆకలి చావులు..ప్రపంచ దేశాల ఆగ్రహం

By :  Vamshi
Update: 2024-03-01 09:32 GMT

గాజాలో మానవతా సాయం కోసం ఎదురు చూస్తున్నవారిపై ఇజ్రాయెల్‌ దాడి చేయటాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి.హమాస్ దాడులతో రగిలిపోయిన ఇజ్రాయెల్.. కన్నుమిన్నూ కానకుండా సుమారు ఐదు నెలలుగా సాగిస్తున్న మారణహోమానికి రోజుకి వందల సంఖ్యలో గాజావాసులు బలవుతున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీరు లేని పరిస్థితుల్లో శిథిలమైన ఇళ్ల మధ్య, చెత్తకుండీల వద్ద తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని వెతుకులాడుతున్న ప్రజల దురవస్థ ఈ ప్రపంచానికి పట్టడం లేదు. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు సాధారణ ప్రజానీకానికి హాని జరగకుండా చూడటం యుద్ధనీతి. ప్రపంచ దేశాల మధ్య కుదిరిన జెనీవా ఒప్పందమూ ఇదే చెబుతోంది.

హమాస్ ఉగ్రవాదులతో పాటు అమాయక ప్రజలనూ శిక్షించడమే లక్ష్యంగా ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ కాలరాస్తోంది. అతలాకుతలమవుతున్న గాజాకు వివిధ దేశాలనుంచి మానవతా సాయాన్ని కూడా అందకుండా చేస్తోంది. అటు రష్యా మీద అక్కసుతో ఉక్రెయిన్‌ను ఎగదోసిన అమెరికా ఇటు హమాస్‌పై దాడుల పేరిట గాజాలో నరమేధం సాగిస్తున్న ఇజ్రాయెల్‌కు కొమ్ముకాస్తోంది. దేశాల మధ్య ఘర్షణలు తలెత్తితే పెద్దన్న పాత్ర పోషించి, మధ్యవర్తిత్వం నెరిపే అగ్రరాజ్యమే అవకాశవాదిగా మారితే పరిణామాలు ఇంతకంటే భిన్నంగా ఎలా ఉంటాయి? కొన్నిచోట్ల గుర్రాలను చంపి, వాటి మాంసాన్ని భక్షిస్తున్న సంఘటనలు.. అభివృద్ధిలో ఆకాశాన్నంటుతున్నామని చెప్పుకుంటున్న ఆధునిక మానవుడిలో మానవత్వం అడుగంటిపోతోందనడానికి ఉదాహరణలు. స్వార్థ ప్రయోజనాలే పరమావధిగా, సైనిక బలాలను, అణ్వాయుధ సంపత్తిని పోగేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా అడుగులు వేస్తున్న అగ్రదేశాలకు కనువిప్పు కలిగితేగానీ ఈ యుద్ధోన్మాదం చల్లారదు.




Tags:    

Similar News