పాకిస్తాన్‌కు భారత ప్రభుత్వం షాకిచ్చింది. భారత్, పాకిస్తాన్ దేశాలకు మధ్యన సింధు నది ఉపనదులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ నదుల నీటిని సమర్థవంతంగా వాడుకునేందుకు భారత్ సిద్ధమైంది. పంజాబ్, జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. దీంతో భారత్ నుంచి పాకిస్తాన్‌కు వెళ్తున్న రావి నది నీటి ప్రవాహాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. భారత్ నుంచి పాకిస్తాన్‌కు 1150 క్యూసెక్కుల రావి నీటిని జమ్మూ కాశ్మీర్‌కు తరలించాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగానే పాక్‌కు వెళ్లే రావి నది నీటిని భారత్ మళ్లించనుంది.
కథువా, సాంబా జిల్లాల్లోని 32 వేల హెక్టార్ల భూమికి సాగు నీరుగా రావి నది నీటిని మళ్లించేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే షాపూర్ కంది బ్యారేజీ పూర్తవ్వడంతో నీటి నిలుపుదల ప్రక్రియ ప్రారంభమైందని తెలుస్తోంది. లఖన్ పూర్ డ్యామ్ నుంచి పాకిస్తాన్ లోకి వెళ్లే నీటిని ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, పంజాబ్ లకు మళ్లించే ఏర్పాట్లు చేసింది. 1995లోనే అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు షాపూర్ కంది బ్యారేజీ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. అయితే ఆ రోజుల్లో జమ్మూకాశ్మీర్, పంజాబ్ ప్రభుత్వాల మధ్య విబేధాలు తలెత్తాయి. అప్పటి నుంచి ఆ ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయింది.
ప్రధాని నరేంద్ర మోడీ జోక్యంతో 2018 తర్వాత షాపూర్ కంది బ్యారేజీ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌కు రూ.3,300 కోట్ల నిధులు ఖర్చయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా సాగు నీటితో పాటుగా 206 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అంతేకాకుండా ఆ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందనుందని కేంద్రం తెలిపింది. ఇటీవలె సింధు నదికి మరో ఉపనది అయిన చీనాబ్ నది నీటిని కూడా పూర్తిగా వినియోగించుకునేందుకు భారత్ సిద్ధమైంది. ఆ నది నీటిని కూడా భారత్ రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణానికి వినియోగించుకోనుంది.