25 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ హైదరాబాద్‌కి వచ్చి మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌ను ప్రారంభించారు. 1998లో తాను ప్రారంభించిన మైక్రోసాప్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ అయిన ఐడీసీ సెంటర్‌ని పాతికేళ్ల తర్వాత మళ్లీ నేడు సందర్శించారు. బుధవారం ఉదయం బిల్ గేట్స్ హైదరాబాద్ లోని మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు రావడంతో సంస్థలోని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. ఇకపోతే ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సంస్థలో ఐడీసీ కీలక పాత్ర పోషిస్తోంది.
అజూర్, విండోస్, ఆఫీస్, బింగ్, కోపిలాట్, ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిన ఏఐ టూల్స్ అభివృద్ధి వెనక ఐడీసీ కీలక పాత్ర పోషించింది. అదేవిధంగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌ల కోసం మైక్రోసాఫ్ట్ 365 మొబైల్ అప్లికేషన్లను తయారు చేయడంలో ఎంతో సహకరించింది. హైదరాబాద్ పర్యటన సందర్భంగా బిల్ గేట్స్ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో ఏఐ, క్లౌడ్, గేమింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో మైక్రోసాఫ్ట్ ఆవిష్కరణలకు కేంద్రం కానుందన్నారు.
ఇంజినీర్లను ఉద్దేశించి బిల్ గేట్స్ అనేక కొత్త విషయాలను తన ప్రసంగంలో తెలిపారు. ఏఐ పవర్డ్ ఇండియాపై బిల్ గేట్స్ మరోసారి ఆశాభావం వ్యక్తం చేస్తూ తమ సంస్థ ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. కాగా గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ 25 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఆ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ విచ్చేసిన సంగతి తెలిసిందే.