'సర్దుకుపోవాలి'.. ఈటల, కోమటిరెడ్డిలతో భేటీలో అమిత్ షా!!
'సర్దుకుపోవాలి'.. ఈటల, కోమటిరెడ్డిలతో భేటీలో అమిత్ షా!!;
గత కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి వచ్చిన కీలక నేతలకు.. కమల దళంలో సరైన ప్రాధాన్యం లభించడం లేదనే గుసగుసలున్నాయి. బిజెపిలో ఉన్న నాయకులు తమను పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నారని, పార్టీలో తమ ప్రాధాన్యం పెరగకుండా చూస్తున్నారనే టాక్ కూడా నడిచింది. ఈ విషయం చివరకు బిజెపి హై కమాండ్ వరకూ వెళ్లడంతో.. అధిష్టానం హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తో పాటు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లను ఢిల్లీకి పిలిపించింది.
ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ , పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈటెల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాలకు సంబంధించి అనేక అంశాలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఈటెల , రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని , పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతూ ఉండడం పైన అమిత్ షా ఆరా తీశారట. అలాగే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిస్థితులు, గతంలో బీజేపీకి ఉన్న గ్రాఫ్, ఇప్పుడు ఉన్న గ్రాఫ్ పైన అమిత్ షా చర్చించారట.
దాదాపు గంట పాటు జరిగిన ఈ చర్చల్లో అనేక అంశాలపై అమిత్ షా క్లాస్ పీకినట్లు విశ్వసనీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేసేందుకు నాయకులకు సంయమనం, సమన్వయం, సర్దుబాట్లు తప్పనిసరని రాష్ట్ర నేతలకు జాతీయ నాయకత్వం తేల్చి చెప్పినట్టు సమాచారం. అయితే పార్టీలో అసంతృప్తి నేతలుగా ప్రచారం జరుగుతున్న ఈటెల, రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో, వారికి కీలకమైన పదవులు ఏమైనా అప్పగించబోతున్నారా అనే ప్రచారం కూడా జరిగింది. ముఖ్యంగా ఈటల రాజేందర్ కు ప్రచారం కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారనే హడావుడి జరిగింది. కానీ అమిత్ షా తో జరిగిన చర్చల తర్వాత పదవులపై చర్చించేందుకు పిలవలేదని, ఈటెల , రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి కి కారణాలు తెలుసుకొని వారిని బుజ్జగించేందుకు పిలిచారనే విషయం అర్థమైంది.