షర్మిలపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు.. ఆ 8 మందిపై చర్యలు?
షర్మిలపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు.. ఆ 8 మందిపై చర్యలు?;
సోషల్ మీడియాలో అసభ్యకర రీతిలో కామెంట్లు చేస్తూ.. తన ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్ ఛానెళ్లు.. ఇతర సోషల్ మీడియాల్లో తనపై ఇష్టారీతిన పోస్టులు చేస్తున్నారని పోలీసులకు తెలిపారు. తనను భయభ్రాంతులకు గురిచేసేలా పోస్టులు పెడుతున్నారన్న ఫిర్యాదుతో.. సైబర్‌క్రైమ్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.
మరికొన్ని రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవల ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా ఎంపికైన వైఎస్ షర్మిల.. తనదైన మార్క్ రాజకీయం చేస్తూ.. అధికారంలో ఉన్న సొంత అన్నకే సవాల్ విసురుతోంది. బహిరంగ సభలు, రోడ్డు షోలలో వైసీపీ ప్రభుత్వ పెద్దలను తూర్పారబడుతోంది. అదేవిధంగా వైసీపీ నాయకులు చేస్తున్న దందాలు, భూ కబ్జాలను బట్టబయలు చేస్తూ ప్రచారంలో దూసుకెళ్తోంది . ఈ క్రమంలోనే అధికార పార్టీ ఆమెను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక మానసికంగా దెబ్బతీసేందుకు కుట్ర చేస్తోంది. దీనిపై ఆమె పోలీసులు ఫిర్యాదు చేశారు.
తాను ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కొందరు దురుద్దేశంతో సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు పెడుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘వైఎస్ షర్మిల ప్రాణాలకు ప్రమాదం.. దొంగల ముఠా.. వైఎస్ షర్మిల క్యాంపు కార్యాలయంలో కోవర్ట్ ఆపరేషన్’ అంటూ కొన్ని పీడీఎఫ్ ప్రతులను సర్క్యులేట్ చేస్తున్నారు. ‘షర్మిల తన అన్నతో విభేదించి వైఎస్‌ఆర్.. వైఎస్ జగన్‌కు ఆజన్మ శత్రువైన చంద్రబాబుతో చేతులు కలిపి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతోంది’ అని వ్యాఖ్యలు చేస్తున్నారు.ఇలాంటి వ్యాఖ్యలు, పోస్టులతో నా వ్యక్తిత్వాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోకపోతే నాకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుంది’’ అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మేదరమెట్ల కిరణ్‌కుమార్, రమేశ్ బులగాకుల, పంచ్ ప్రభాకర్(అమెరికా), ఆదిత్య(ఆస్ట్రేలియా), సత్యకుమార్ దాసరి(చెన్నై), సేనాని, వర్రా రవీందర్‌రెడ్డి, శ్రీరెడ్డి, మహ్మద్ రెహ్మత్ పాషా తదితర వ్యక్తులు సామాజిక మాధ్యమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందుతుల కోసం గాలిస్తున్నారు.