దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లోక్ సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ విడుదల చేసింది. ఈసీ ప్రకటనతో రాష్ట్రంలో పాటు దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఏపీ, ఒడిషా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ ప్రకటించారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీలకూ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఏపీలో ఏప్రిల్ 18న నోటిఫికేషన్, మే 13న ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అరుణాచల్ నోటిఫికేషన్ మార్చి 20న విడుదల చేస్తామని, ఏప్రిల్ 19న ఎన్నికలు ఉంటాయన్నారు. సిక్కింలో మార్చి 20న నోటిఫికేషన్, 19 ఏప్రిల్ న పోలింగ్ ఉంటుందన్నారు.
ఓడిశాలో తొలి దశ మే 13న ఉంటుందని, మే 26న రెండో దశ ఉంటుందన్నారు.ప్రస్తుత లోక్ సభ పదవీకాలం జూన్ 16తో ముగియనుందని, కాబట్టి జూన్ 16 కల్లా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఈసారి ఎన్నికలకు 55 లక్షల ఈవీఎంలను వాడుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో కోటీ 50 లక్షల మంది సిబ్బంది పాల్గొంటారన్నారు. ఈసారి కోటీ 82 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదైనట్లు తెలిపారు.పోలింగ్ వేళ అవాంఛనీయ ఘటనల నివారణ బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని తెలిపారు. సోషల్ మీడియా, వెబ్ కాస్టింగ్, 1950 టోల్ ఫ్రీ నెంబర్, గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా సమాచారం సేకరిస్తామని రాజీవ్ కుమార్ వెల్లడించారు. పోలింగ్ రోజు నిరంతరం సమాచారం తెలుసుకుంటామని, ఐదు మాధ్యమాల పర్యవేక్షణకు జిల్లా స్థాయి అధికారి ఉంటారని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య అనధికార వస్తువులు, డబ్బు రవాణా జగరకుండా నిఘా వేస్తామని, అంతర్జాతీయ సరిహద్దుల్లోనూ డ్రోన్లతో నిఘా ఉంటుందని వివరించారు.