ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో కవిత భర్త అనిల్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కలిశారు. కవిత యోగ, క్షేమాలను అడిగి కనుక్కున్నారు. ఈ కేసులో న్యాయపోరాటం చేద్దామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా న్యాయవాది మోహిత్ రావు కూడా కవితను కలిశారు. ప్రతిరోజు కవితను కుటుంబ సభ్యులు, ఆమె న్యాయవాదులు కలుసుకునే వెసులుబాటును కోర్టు కల్పించిన సంగతి తెలిసిందే. కుటుంబ భోజనం తెప్పించుకోవడానికి కోర్టు అనుమతించింది.
వారం రోజుల పాటు కవితను ఈడీ కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. శనివారం నాడు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సుదీర్ఘంగా జరిగిన వాదనల అనంతరం..ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇచ్చింది. ఈడీ కవితని అరెస్ట్ చేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ రేపు (సోమవారం) ఆమె సుప్రీంలో పిల్ వేయనున్నారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న కవిత తరుఫున ఆమె భర్త అనిల్ కుమార్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. కవిత తరుఫున ప్రముఖ సీనియర్ న్యాయవాదలు ముకుల్ రోహత్గీ, కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నట్లు సమాచారం.