మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈయన వైసీపీకి రాజీనామా చేసి ఫిబ్రవరిలో జనసేన పార్టీలో చేరారు. పోత్తులో భాగంగా జనసేనకు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లు దక్కాయి. కాకినాడ లోక్ సభ సీటు ఉదయ్ శ్రీనివాస్ పేరును ఇదివరకే ఖరారు చేశారు. టీడీపీ, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 2 లోక్ సభ స్థానాలు, 21 శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తోంది.
అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. విశాఖ సౌత్ అభ్యర్థిగా వంశీకృష్ణ యాదవ్ పేరు దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది. అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ స్థానాల్లో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో... ఆయా స్థానాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. సరైన అభ్యర్థుల కోసం సర్వే జరుగుతోందని జనసేన తెలిపింది. సర్వేల్లో సంతృప్తికర ఫలితాలు వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించింది.