వైసీపీ 9వ జాబితా విడుదల.. లోకేష్‌పై పోటీచేయబోయేది ఎవరో తెలుసా..!
మంగళగిరి అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ!!!;
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇదివరకే పలు నియోజకవర్గాల ఇంఛార్జులను మార్చిన వైసీపీ అధిష్టానం తాజాగా 9వ జాబితాను శుక్రవారం (మార్చి 1న) వెల్లడించింది. ఒక పార్లమెంట్ నియోజకవర్గం, రెండు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన కొత్త ఇంఛార్జులను నియమించింది.
రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించింది వైసీపీ . అందులో ప్రధానంగా నెల్లూరు పార్లమెంట్ ఇంచార్జ్‌గా విజయసాయిరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. కర్నూలు అసెంబ్లీ ఇంచార్జ్‌గా ఇంతియాజ్ (రిటైర్డ్ ఐఏఎస్), మంగళగిరి అసెంబ్లీ ఇంచార్జ్‌గా మురుగుడు లావణ్య పేర్లను ప్రకటించింది. మంగళగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే ఉండగా… కొత్త ఇంఛార్జుగా మురుగుడు లావణ్య పేరును ఖరారు చేశారు. మంగళగిరికి గతంలో గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించగా.. ఇప్పుడు ఆ స్థానంలో మార్పు చేసింది వైసీపీ. మంగళగిరిలో జరిగిన కీలక సమావేశంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీకి ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని చెప్పారు.
వైసీపీని గద్దె దించుదామని వ్యూహాలు రచిస్తున్న టీడీపీ, జనసేన పార్టీలు ఇటీవల 99 మందితో ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో మంగళగిరి నుంచి టీడీపీ , జనసేన బలపరిచిన అభ్యర్థిగా నారా లోకేష్ పోటీలోకి దిగనున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి పై ఓటమి చెందారు లోకేష్. అయితే.. తాజాగా వైసీపీ అధిష్టానం మంగళగిరి అభ్యర్థిని మార్చింది. ఈసారి ఆర్కేకు కాకుండా లావణ్యకు టికెట్ ఇచ్చింది.