Muralidhar Rao : ఈటలకు టికెట్.. బీజేపీకి మురళీధర్ రావు గుడ్ బై..?

By :  Krishna
Update: 2024-03-03 04:58 GMT

లోక్ సభ అభ్యర్థుల ప్రకటనతో తెలంగాణ బీజేపీలో అసమ్మతి చెలరేగింది. తెలంగాణలో 9స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో ముగ్గురు సిట్టింగులకు మళ్లీ టికెట్ ఇచ్చింది. సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి, కరీంనగర్ - బండి సంజయ్, నిజామాబాద్ - ధర్మపురి అర్వింద్ లకు మళ్లీ అవకాశం ఇచ్చింది. మిగితా ఆరు చోట్ల కొత్తవారిని ఎంపిక చేసింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ముగ్గురికి బీజేపీ హైకమాండ్ టికెట్లు ఇవ్వడం గమనార్హం. ఈ అంశమే బీజేపీలో అసమ్మతిని రేపింది.

మల్కాజిగిరి - ఈటల రాజేందర్, జహీరాబాద్ - బీబీ పాటిల్, హైదరాబాద్ - మాధవీ లత, భువనగిరి - బూర నర్సయ్య గౌడ్ , చేవేళ్ల - కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్ - పి.భరత్ లకు తొలిజాబితాలో చోటు దక్కింది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ శుక్రవారమే బీజేపీలో చేరారు. ఒక రోజులోనే ఆయనకు కమలం పార్టీ టికెట్ ఇచ్చింది. ఎంపీ రాములు కూడా గురువారమే తన కొడుకుతో కలిసి కమలం కండువా కప్పుకున్నారు. ఆయన కొడుకుకు తొలి జాబితాలో చోటు దక్కడం గమనార్హం.

గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన ఈటల రాజేందర్కు మల్కాజ్ గిరి టికెట్ దక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన హుజురాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా పార్టీ ఈటలకు మరోసారి అవకాశం ఇచ్చింది. అయితే మల్కాజ్ గిరి టికెట్ను బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు ఆశించారు. గత కొంత కాలం నుంచే నియోజకర్గంలో ఆయన ప్రచారం మొదలుపెట్టారు. అయితే అనూహ్యంగా ఈటల తెరమీదకు రావడంతో మురళీధర్ రావు అసంతృప్తితో ఉన్నారు.

‘‘గత కొన్నేళ్లుగా మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో నాకోసం పనిచేసిన నా సహచరులు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు. త్వరలో మీ అందరినీ వ్యక్తిగతంగా కలుస్తాను. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను’’ అని మురళీధర్ రావు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ చర్చనీయాంశమైంది. మురళీధర్ రావు బీఆర్ఎస్లోకి వెళ్తారనే ప్రచారం కూడా సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి ఆయన మల్కాజ్గిరి అభ్యర్థిగా బరిలో ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత అన్నది వెయిట్ అండ్ సీ..

Tags:    

Similar News