'అదంతా ఒట్టి ప్రచారం..' బీజేపీ చీఫ్ మార్పుపై బండి సంజయ్
'అదంతా ఒట్టి ప్రచారం..' బీజేపీ చీఫ్ మార్పుపై బండి సంజయ్;
'అదంతా ఒట్టి ప్రచారం..' బీజేపీ చీఫ్ మార్పుపై బండి సంజయ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సీనియర్ నేత ఈటల రాజేందర్ లేదా డీకే అరుణకు అధ్యక్ష పదవి కట్టబెట్టి.. ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌కు (Bandi Sanjay) కేంద్ర మంత్రి పదవి ఇస్తారని టాక్ నడిచింది. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాక నాయకులు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష మార్పు ప్రచారంపై బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ బిజెపి అధ్యక్షున్ని మార్చనున్నారంటూ జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని సంజయ్ స్పష్టం చేసారు. ఇతర పార్టీలు చేసే ఈ ప్రచారాన్ని బిజెపి క్యాడర్ నమ్మవద్దని సూచించారు. ఏదయినా వుంటే బిజెపి పెద్దలే స్వయంగా ప్రకటిస్తారని అన్నారు. పార్టీ లైన్ లోనే వుంటూ బిజెపి బలోపేతానికి పనిచేస్తున్నానని... పార్టీ జాతీయాధ్యక్షుడి ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. తనను రాష్ట్ర అధ్యక్ష పదవినుండి తొలగించి కేంద్ర మంత్రిని చేస్తారంటూ ప్రచారం జరుగుతోందని , బిజెపిని బలహీనపర్చేందుకు జరుగుతున్న కుట్రల్లో భాగమే ఈ ప్రచారమని అన్నారు. బిజెపి అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు ముందుగానే లీకయ్యే అవకాశాలు వుండవని... గతంలో ఎప్పుడూ ఇలా జరిగిన దాఖలాలు లేవన్నారు.
‘రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను. పదవుల కోసం కాదు.. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తను నేను. అధ్యక్షుడి మార్పు ప్రచారం గురించి ఆలోచించటం లేదు. జాతీయ నాయకత్వం పార్టీ కోసం పనిచేయమంటే చేస్తాను. ఇంట్లో కూర్చోమంటే కూర్చుంటాను. బీజేపీ లీకుల పార్టీ కాదు.. కేంద్రంమంత్రి వర్గం విస్తరణ ఆఖరివరకు ఎవరకీ తెలియదు. బీజేపీకి ఓటు వేయాలని తెలంగాణ సమాజం డిసైడ్ అయింది. బీఆర్ఎస్‌తో కాకుండా.. కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కొట్లాడుతోంది. బీఆర్ఎస్ ను ధైర్యంగా ఎదుర్కొనేది బీజేపీ మాత్రమే. ఒక్కో నియోజకవర్గంలో బీజేపీకి ముగ్గురు, నలుగురు అభ్యర్థులున్నారు. హుజూరాబాద్ సహా.. కాంగ్రెస్‌కు చాలా చోట్ల అభ్యర్థులు లేరు’ అని బండి చెప్పుకొచ్చారు.