హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి బండి సంజయ్.. అసలేం జరుగుతుంది?

పార్టీలో అంతర్గత వివాదాలపై సీరియస్;

Update: 2023-06-27 02:06 GMT



రాష్ట్రంలోని బీజేపీ నాయకులు హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్ ప్రయాణాలు చేస్తున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి రావాలని ఆదేశించిన పార్టీ అధిష్టానం.. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను హస్తినకు రావాలని ఆదేశించింది. దీంతో బండి సంజయ్ నిన్న హుటాహుటిన తన అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఢిల్లీ బాటపట్టారు.

ఈటల, కోమటిరెడ్డి ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత బండి సంజయ్‌‌ను అధిష్టానం హస్తినకు పిలిపించడంతో అసలేం జరుగుతుందన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. బండి వ్యవహార శైలిపై ఈటల, కోమటరెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేయడమే అందుకు కారణమని తెలుస్తోంది. అధ్యక్ష బాధ్యతలకు ఆయన అర్హుడు కాడని, వెంటనే తప్పించాలని డిమాండ్‌ చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడించాలని చూస్తున్న బీజేపీ హైకమాండ్‌కు రాష్ట్ర నేతల మధ్య సమన్వయం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. టీబీజేపీ నేతల మధ్య సయోధ్య లేకపోవడం వల్ల పార్టీకి నష్టం కలిగించే అంశాలపైనా హైకమాండ్ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ తీరు మార్చుకోవాలని జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.




Tags:    

Similar News