విదేశాల్లో 15 సెంచరీలు చేశాను,అదేమీ చెత్త రికార్డ్ కాదు-విరాట్

Update: 2023-07-22 05:11 GMT

వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో స్టార్ ఆటగాడు విరాట్ చెలరేగిపోతున్నాడు. మంచి ఫామ్ లో ఉండి సెంచరీ కొట్టాడు. 500వ అంతర్జాతీయ మ్యాచ్లో శతక్కొట్టిన ఒకేఒక్కడుగా చరిత్రలో నిలిచిపోయాడు. మరోవైపు అత్యధిక శతకాలు చేసినవారిలో సచిన్ ను దాటి ముందుకు వెళ్ళిపోయాడు. అన్ని ఫార్మాట్ లలో కలిపి సచిన్ 75 సెంచరీలు చేయగా విరాట్ 76తో కొనసాగుతున్నాడు.

విదేశాల్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి నాలుగున్నరేళ్ళయింది. చివరిసారి 2018లో ఆస్టేలియా మీద శతకం కొట్టాడు. దీని గురించి విరాట్ మాట్లాడుతూ నేను ఎలా ఆడాలనుకున్నానో అలానే బ్యాటింగ్ చేశానని చెప్పాడు. చాలా సంతోషంగా ఉందంటూ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నాడు. ఎప్పుడూ నాతో నేను పోటీ పడుతూ అత్యుత్తమ ఆట ఆడేందుకు ప్రయత్నిస్తా అని చెప్పుకొచ్చాడు. నాలుగున్నరేళ్ళ తర్వాత సెంచరీ చేశానని చెబుతున్నారు. ఇలాంటివన్నీ మాట్లాడుకోవడానికి బావుంటాయి. కానీ నేను విదేశాల్లో 15 సెంచరీలు చేశా....అదేమీ చెత్త రికార్డ్ కాదు. స్వదేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువ చేశా. ఈ ఐదేళ్ళల్లో బయట ఎక్కువ మ్యాచ్ లు ఆడలేదు. హాఫ్ సెంచరీలు చేశాను. జట్టుకోసం ఆడటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు.

భారత్ తరుఫున 500 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడడం గర్వంగా ఉందని అన్నాడు విరాట్ కోహ్లీ. అన్ని ఫార్మాట్ లలో ఆడగల సత్తా ఉండడమే ఇందుకు కారణం. ఫిట్ నెస్ వల్లనే ఇదంతా సాధ్యమైందని చెప్పాడు. ఇక తన భర్త సాధించిన ఘనతకు అనుష్క మురిసిపోతోంది. తన ఇన్స్టాలో విరాట్ సెంచరీ చేసిన అభివాదం చేస్తున్ ఫోటో మీద లవ్ సింబల్ ఉంచి షేర్ చేసింది.

ఇక వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 438 పరుగులకు ఆలౌట్ అయింది. ఈసారి విండీస్ కూడా గట్టిగానే నిలబడింది. ప్రస్తుతం 86 పరుగులకు ఒక వికెట్ కోల్పోయి ఆడుతోంది.



Tags:    

Similar News