SA20 2024: టీ20 మ్యాచ్‌లో విధ్వంసం.. ఒక మ్యాచ్లో ఏకంగా 462 పరుగులు

Byline :  Bharath
Update: 2024-02-02 06:54 GMT

టీ20 ఫార్మట్ విధ్వంసాలకు కేరాఫ్ గా మారింది. సాధ్యకాని, ఊహకందని, ఎవరూ అనుకోని.. రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా మరో రికార్డ్ నమోదైంది. ఒక మ్యాచ్ లో ఏకంగా 462 పరుగులు, 34 సిక్సర్లు నమోదయ్యాయి. గురువారం సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో ఎంఐ కేప్ టౌన్, ప్రిటోరియా క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ పరుగుల వరద పారింది. సెంచూరియన్ సూపర్ స్పోర్ట్ స్టేడియం.. ఈ విధ్వంసానికి వేదికైంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఏంఐ కేప్‌టౌన్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఎంఐ బ్యాటర్ రికెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. కేవలం 45 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 90 పరుగులు చేశాడు. అతని విధ్వంసానికి డెవాల్డ్ బ్రెవిస్ (66, 32 బంతుల్లో, 3 ఫోర్లు.. 6 సిక్సర్లు) తోడయ్యాడు. పోలార్డ్ కూడా ఆఖర్లో బ్యాట్ కు పనిచెప్పాడు. కేవలం 7 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ప్రిటోరియా క్యాపిటల్స్ బౌలర్ పార్నెల్ 3 వికెట్లు పడగొట్టాడు.

249 పరుగుల భారీ లక్ష్యాన్ని చూసి ఏమాత్రం జంకని ప్రిటోరియా క్యాపిటల్స్.. చివరి వరకు పోరాడింది. కైల్ వెర్రెయిన్నో విరోచితంగా పోరాడినా ఫలితం దక్కలేదు. కేవలం 52 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 116 పరుగులు చేసిన వెర్రెయిన్నో.. అజేయంగా నిలిచాడు. వెర్రెయిన్నో మరో బ్యాటర్ సపోర్ట్ లభించి ఉంటే.. ఫలితం వేరేలా ఉండేది. ఈ హై స్కోరింగ్ మ్యాచ్ లో ఆఖరికి 34 పరుగుల తేడాతో ఎంఐ కేప్ టౌన్ విజయం సాధించింది. ఎంఐ బౌలర్లలో తుషారా 3 వికెట్లు పడగొట్టగా.. రబాడ రెండు, పోలార్డ్‌, సామ్‌ కుర్రాన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

Tags:    

Similar News