IND vs AFG: గెలుపు దిశగా టీమిండియా.. రాణిస్తున్న శివమ్ దూబె
తొలి టీ20లో ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చిన 159 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా చేరుకుంటుంది. 10 ఓవర్లకు 84 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. అయితే భారత్ కు అనుకున్న శుభారంభం లభించలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. దాదాపు 14 నెలల తర్వాత టీ20ల్లో ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దీంతో తొలి ఓవర్ లోనే టీమిండియా వికెట్ కోల్పోయింది. ఫజల్హక్ ఫరూఖీ వేసిన తొలి ఓవర్ మొదటి బంతిని డిఫెన్స్ ఆడిన రోహిత్, రెండో బంతిని మిడ్ ఆఫ్ మీదుగా కొట్టాడు.
ఆ తర్వాత రోహిత్ సింగిల్ కోసం ప్రయత్నించగా.. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ స్పందించలేదు. బాల్ వైపు చూస్తూ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లోనే ఉండిపోయాడు. అదే టైంలో మిడ్ ఆఫ్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న ఇబ్రహీం జద్రాన్ మెరుపు వేగంతో బంతిని అందుకుని కీపర్ కు విసిరాడు. దీంతో రోహిత్ రన్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో మైదానాన్ని వీడుతున్న రోహిత్, గిల్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన తప్పు వల్లే ఔట్ అయినట్లు చెప్పాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.