Mohammed Shami: ధావన్‌ బయటపడ్డాడు .. మరి షమీ సంగతేంటి?

Update: 2023-10-06 03:50 GMT

ప్రేమించి, పెళ్లి చేసుకున్న భాగస్వామి నుంచి.. అప్యాయత, అనురాగాలకు బదులుగా అసూయద్వేషాలు ఎదురైతే వాటిని భరించడం చాలా కష్టం. మామూలు వ్యక్తులే కాదు.. సెలబ్రిటీలు సైతం ఆ బాధలను ఇప్పటికీ అనుభవిస్తున్నారు. ఇష్టపడి చేసుకున్న వ్యక్తి పెట్టే కష్టాలను ఇన్నాళ్లు మౌనంగా భరించి.. ఇక లాభం లేదనుకుని విడాకుల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తమ విలువైన సమయాన్నంతా కోర్టు వాయిదాలకు వెచ్చిస్తూ.. తమకు విముక్తి ఎప్పుడా అంటూ భారంగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా లెజెండరీ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్‌కు ఇటీవలె కోర్టు అతని భార్య నుంచి విడాకులు ఇప్పించి ఆ ప్రత్యక్ష నరకం నుంచి విడుదల చేసింది. కోర్టు తీర్పుతో అతనికి స్వేచ్ఛ లభించగా.. మరో క్రికెటర్ మహమ్మద్ షమీ మాత్రం ఇంకా ఆ నిర్భంధంలోనే ఉన్నాడు.

మహమ్మద్ షమీ 2014 లో హసీన్ జహాన్‌ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే, హాసిన్ జహాన్‌కు ఇంతకు ముందే పెళ్లి జరిగి.. ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. ఆమె భర్త పశ్చిమ బెంగాల్‌లో ఓ చిన్న షాపు నడుపుతుంటాడు. భర్తతో విబేధాలు వచ్చి, అతనితో విడిపోయి.. షమీకి చేరువైంది. 2012లో మహమ్మద్ షమీ, హసీన్ ఐపిఎల్ మ్యాచ్ సందర్భంగా కలుసుకున్నారు. వీరి ఫస్ట్ మీట్‌లోనే షమీ.. హాసిన్ జహాన్‌తో ప్రేమలో పడ్డాడు. వారిద్దరూ ఒకరితో ఒకరు డేటింగ్ చేయడం ప్రారంభించారు.

డేటింగ్ సమయంలో తన ఇద్దరు కుమార్తెలను(మొదటి సంతానాన్ని) తన కజిన్స్ అని షమీని నమ్మించింది. ఇలా చాలా కాలం కొనసాగిన తరువాత.. వారిద్దరూ 6 జూన్, 2014 న మొరాదాబాద్-ఢిల్లీ రోడ్‌లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో వివాహం చేసుకున్నారు. కొంతమంది ప్రత్యేక వ్యక్తులు మాత్రమే వారి వివాహానికి హాజరయ్యారు. హసీన్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకోగా.. చిన్నప్పటి నుంచి ఆమెకు మోడలింగ్ పట్ల ఆసక్తి ఉంది. కొంతకాలం మోడలింగ్ కూడా చేయగా.. ఐపీఎల్ మ్యాచ్‌లలో చీర్‌ లీడర్‌గా కూడా పని చేసింది. అయితే, వివాహం తర్వాత ఆమె తన వృత్తిని వదిలివేసింది. షమీతో ఓ కూతుర్ని(బేబి ఐరా) కన్న తర్వాత.. అతనిపై వేధింపులు మొదలుపెట్టింది.

తనపై గృహహింసకు పాల్పడుతున్నాడని, పరాయి మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడంటూ.. 2018లోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఈ కేసు పెద్ద దుమారమే రేపింది. ఈ ఫిర్యాదు కారణంగా ప్రపంచ కప్ 2019లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన మహ్మద్ షమీ, అతని భార్య దాఖలు చేసిన క్రిమినల్ & సివిల్ కేసుల కారణంగా అతని వీసా పోస్ట్‌ను US రద్దు చేసింది. షమీపై బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్, పాకిస్థానీ ఏజెంట్లతో జతకట్టడం & మరెన్నో క్రూరమైన ఆరోపణలు చేసింది హసీన్. ఈ ఆరోపణలన్నింటిని నిజమని నమ్మి అతడిని క్రికెట్‌కు దూరం చేసింది BCCI . ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ ఆరోపణలన్నీ అబద్ధమని గుర్తించి, షమీని తిరిగి జట్టులోకి తీసుకుంది.

షమీపై 498A, 307, 376 సెక్షన్ ల కింద కేసు పెట్టింది హసీన్ . ఇది చాలదన్నట్లుగా అతని సోదరులపై కూడా మెయింటెనెన్స్ కేసులు, గృహ హింస మొదలైన అనేక కేసులను దాఖలు చేసింది. కూతురు ఐరా బాగోగుల కోసం షమీ నుండి నెలకు 10 లక్షలు డిమాండ్ చేసింది. ఇటీవల ప్రొఫెషనల్ మోడల్ తనకు, ఐరాకు కలిపి నెలకు 1.3 లక్షల మెయింటెనెన్స్ చెల్లించాలని కోరింది. ఆ లెక్కన ఆమె 2018లో ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే మొత్తం 78 లక్షలు అవుతుంది. ఈ ఏడాది కూడా షమీ పై నమోదైన క్రిమినల్ కేసుకు సంబంధించిన విచారణలో ఎలాంటి పురోగతి లేదని, అతని అరెస్ట్ వారెంట్‌పై స్టేను ఎత్తివేయాలని కోరుతూ.. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. వీటన్నంటి కారణంగా మానసిక క్షోభ అనుభవిస్తూ.. తన ప్రాణానికి ప్రాణమైన తన కూతురిని కలుసుకోలేకపోతున్నానని మీడియా ముందే బావురమన్నాడు షమీ. 6 ఏళ్లు గడిచినా ఈ కేసులు కొలిక్కి రాలేదు. కోర్టు విచారణ కోసం షమీ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నాడు.



Tags:    

Similar News