Mitchel Marsh: కాళ్ల కింద వరల్డ్ కప్ ట్రోఫీ.. మిచెల్ మార్ష్ పిక్ వైరల్

Byline :  Veerendra Prasad
Update: 2023-11-20 06:54 GMT

అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం భార‌త్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. దాంతో ఆస్ట్రేలియా ఆరోసారి వన్డే ప్రపంచకప్‌ను అందుకుంది. ప్రపంచ క్రికెట్‌లో మరే జట్టుకూ సాధ్యం కాని రీతిలో ఆసీస్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టుపై సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. అయితే.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీని ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ మిచెల్ మార్ష్ అగౌర‌వ ప‌రిచిన‌ట్లు ఆరోప‌ణ‌లు వచ్చాయి. ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీ పై మిచెల్ మార్ష్ కాలు పెట్టిన‌ట్లు ఉన్న ఓ ఫోటో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.




 


వన్డే ప్రపంచకప్ 2023 ట్రోఫీని మైదానం నుంచి ఆస్ట్రేలియా ఆటగాళ్లు హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆసీస్ ప్లేయర్స్ మరోసారి ట్రోఫీతో ఫొటోస్ దిగారు. మిచెల్ మార్ష్ సోఫాలో కూర్చుని.. ప్రపంచకప్ 2023 ట్రోఫీపై తన రెండు కాళ్లు పెట్టి ఫొటోలకు పోజులిచ్ఛాడు. ఆస్ట్రేలియా ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకున్న కొన్ని గంటల తర్వాత ఈ ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. ఈ ఫోటోను తొలుత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ఆపై వైరల్ అయింది. హోటల్ రూమ్ లో మార్ష్ ఇలా బీర్ తాగుతూ ట్రోఫీని కాళ్ల కింద పెట్టుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంత మంది అభిమానులు ఇండియా గెలిచినప్పుడు మన ప్లేయర్స్ ఆ ట్రోఫీని ఎలా చూసుకున్నారో గుర్తు చేసుకుంటూ ఇదేం పద్ధతంటూ మార్ష్ తీరును తప్పుబట్టారు. ప్రపంచకప్‌కు కాస్త గౌరవం ఇవ్వు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రపంచకప్ 2023 ఫైనల్లో మిచెల్ మార్ష్ 15 రన్స్ చేశాడు. 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ బాదిన మిచెల్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయ్యాడు. మెగా టోర్నీలో మిచెల్ మార్ష్ 441 రన్స్ చేశాడు.




 





Tags:    

Similar News