IPL 2024: పరుగుల వరదకు అడ్డుకట్ట.. బౌలర్లకు అనుకూలంగా బీసీసీఐ కొత్త రూల్
ఐపీఎల్ అనగానే పరుగుల వరదే గుర్తొస్తుంది. ఎంత పెద్ద బౌలర్ అయినా.. బ్యాటర్ల విధ్వంసం ముందు చేతులెత్తుస్తారు. బౌండరీలు బాదుతుంటే ప్రేక్షక పాత్ర పోషించి చూస్తూ ఉండిపోతారు. అది చాలదన్నట్లు.. గత సీజన్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను తీసుకొచ్చింది బీసీసీఐ. అయితే అదంతా అప్పటి ముచ్చట. ఇప్పుడు రూల్స్ మారాయి. బౌలర్ల రోజులొచ్చాయి అంటుంది బీసీసీఐ. బ్యాటర్లకు మరింత పరీక్ష పెట్టేలా బౌలర్లకు బీసీసీఐ కొత్త అస్త్రం ఇవ్వనుంది. ఒక ఓవర్లో 2 బౌన్సర్లు వేసుకునేలా బౌలర్ కు అవకాశం కల్పించనుంది.
దీనికోసం ఐపీఎల్ 2024లో ఈ కొత్త రూల్ అమలు చేస్తారని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ రూల్ ను టెస్ట్ చేసి చూశారు. ఐపీఎల్ 2024లో అమలు చేసేందుకు బీసీసీఐ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. బీసీసీఐ తాజా నిర్ణయంపై బౌలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బౌలర్ కు రెండు బౌన్సర్లు వేసే అవకాశం ఇస్తే.. బ్యాటర్ బాదుడుకు అడ్డుకట్ట వేసినట్లే. కాగా.. ఐసీసీ ఇప్పటికే వన్డే, టెస్టుల్లో ఓవర్‌కు రెండు బౌన్సర్లను అనుమతియ్యగా.. టీ20 ఫార్మాట్‌లో ఇప్పటి వరకు ఒక బౌన్సర్‌కే అనుమతి ఉంది. దీంతో ఐపీఎల్ 2024 మరింత రసవత్తరంగా ఉండనుంది.