ప్రపంచ క్రికెట్ లో అత్యంత ధనిక బోర్డ్ ఏదంటే టక్కున గుర్తొచ్చే పేరు బీసీసీఐ. ఈ విషయంలో ఏ దేశం కూడా బీసీసీఐ దరిదాపుల్లో కూడా లేవు. ఎందుకంటే మన దేశ బోర్డ్ దగ్గర అక్షరాల రూ.18,700 కోట్ల రూపాయలు ఉన్నాయన్న మాట. ఇంత డబ్బు పొందడానికి కారణం ముఖ్యంగా ఐపీఎలే. 2008 నుంచి ఇప్పటి వరకు 16 సీజన్లు పూర్తి చేసుకోగా.. మార్చి, ఏప్రిల్ నెలలో మరో సీజన్ కు రంగం సిద్దం అయింది. అయితే బీసీసీఐ మరోసారి కాసుల వేటను మొదలుపెట్టింది. అయితే ఈసారి ఐపీఎల్ రూపంలో కాదు.
ఐపీఎల్ తరహాలో టీ10 లీగ్ ను తీసుకొచ్చే ఆలోచన చేస్తుంది బీసీసీఐ. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. వచ్చే ఏడాది సెప్టెంబరు- అక్టోబర్ నెలల్లో ఐపీఎల్ టైయర్-2 లీగ్ అరంగేట్రం చేయొచ్చని బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ లీగ్ టీ20 ఫార్మట్ లోనా? టీ10 ఫార్మట్ లో నిర్మించాలా అనే ఆలోచనలో బోర్డ్ ఉన్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా.. ఈ లీగ్ లో వయో పరిమితి విధించాలన్న ఆలోచన కూడా ఉంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలతో సంప్రదింపుల తర్వాత బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది.