యాషెస్ సిరీస్ రెండో టెస్టులో బెయిర్ స్టో వివాదస్పద ఔట్‌పై దుమారం కొనసాగుతూనే ఉంది. ఆస్ట్రేలియా తీరును పలువురు ఆటగాళ్లు, మాజీలు తప్పుబడుతున్నారు. ఈ వివాదంపై రెండు దేశాల ప్రధానుల మధ్య మాటల యుద్ధం జరగడం హాట్ టాపిక్‌గా మారింది. తొలుత యూకే ప్రధాని రిషి సునాక్ కంగారూల తీరుపై విమర్శలు చేయగా.. దానికి ఆసీస్ ప్రధాని కౌంటర్ ఇచ్చారు. ఇక ఇరు దేశాల మీడియాల్లో ఒకరికి వ్యతిరేకంగా ఒకరు కథనాలను ప్రచురిస్తున్నారు. తాజాగా ఆసీస్ మీడియా అత్యూత్సాహం ప్రదర్శించింది.
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను ఉద్దేశించి ‘ఏడుస్తున్న చిన్నపిల్లాడు’ అనే హెడ్డింగ్‌తో ఓ కథనం ఆస్ట్రేలియా న్యూస్‌పేపర్‌లో దర్శనిచ్చింది. స్టోక్స్ చిన్నపిల్లాడిలా గ్రౌండ్‌లో బంగురుతున్నట్లు మార్ఫింగ్ చేసిన ఫోటో ప్రచురించింది. స్టోక్స్ నోటిలో పాలపీక పెట్టింది. పక్కన యాషెస్ టైటిల్, టెస్టుల్లో వాడే రెడ్ బాల్‌ను ఉంచింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆసీస్ కథనానికి స్టోక్స్ కూడా కౌంటర్ ఇచ్చాడు.ఆ క్లిప్పింగ్‌ను షేర్ చేసిన బెన్ స్టోక్స్ ‘‘నా గురించి అయి ఉండదని కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను కొత్త బంతితో ఎప్పుడు బౌలింగ్ చేశాను?’’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. స్టోక్స్ సూపర్ కౌంటర్ ఇచ్చాడంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఏం జరిగిదంటే...
రెండో టెస్టు చివరి రోజు తొలిసెషన్ ఆటలో బెయిర్‌స్టోను ఆస్ట్రేలియా ఔట్ చేసిన తీరు వివాదస్పదంగా మారింది. ఇంగ్లాండ్ 193/5గా ఉన్న సమయంలో గ్రీన్ తన ఓవర్ చివరి బంతిని బౌన్సర్ వేశాడు. ఆ బాల్‌ను బెయిర్ స్టో వదిలివేయగా కీపర్ అలెక్స్ కేరీ అందుకున్నాడు. ఓవర్ పూర్తైందని భావించిన బెయిర్ స్టో వెంటనే క్రీజ్ వదిలి ముందుకు నడిచాడు. అదును చూసి ఆస్ట్రేలియా కీపర్ వికెట్లను కొట్టడంతో అంపైర్ దానిని ఔట్‌గా ప్రకటించాడు. కీలక సమయంలో బెయిర్ స్టోను ఆస్ట్రేలియా క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఔట్ చేయడంపై వివాదం చెలరేగింది. మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లను తీరును స్టోక్స్ తప్పుబట్టాడు. క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించడం ద్వారా వచ్చే విజయం మాకు అవసరం లేదు. నేను అయితే అప్పీల్‌ను వెనక్కి తీసుకొనేవాడిని అని కామెంట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా మీడియా స్టోక్స్‌ను టార్గెట్ చేసింది. ఐదుటెస్ట్ ల సిరీస్‌లో ప్రస్తుతం కంగారులు 2-0తో ఆధిక్యంలో నిలిచారు. ఇకమూడో టెస్టు జులై 6 నుంచి ప్రారంభం కానుంది.