దులీప్ ట్రోఫీ విజేతగా సౌత్ జోన్ నిలిచింది. ఆసక్తికరంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో వెస్ట్ జోన్ పై 75 పరుగుల తేడాతో సౌత్ జోన్ విజయం సాధించింది. సౌత్‌జోన్ నిర్దేశించిన 298 పరుగులు లక్ష్యాన్ని చేధించే క్రమంలో వెస్ట్ జోన్ 213 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 182/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన వెస్ట్‌జోన్ అదనంగా కేవలం 40 పరుగులు మాత్రమే చేయగలిగింది. వెస్ట్ జోన్ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ (95), సర్ఫరాజ్ ఖాన్ (48) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. సౌత్ జోన్ బౌలర్లు వాసుకి కౌషిక్ (4/36), సాయి కిశోర్ (4/57)లు విజృంభించారు. దీంతో హనుమ విహారి నేతృత్వంలోని సౌత్ జోన్ దులీఫ్ ట్రోఫీని ఎగురవేసుకుపోయింది.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 213 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హనుమ విహారి హాఫ్ సెంచరీ(63) రాణించగా, తిలక్ వర్మ 40 పరుగులు చేశాడు తర్వాత కావేరప్ప ఏకంగా ఏడు వికెట్లతో చెలరేగడంతో వెస్ట్‌జోన్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ పృథ్వీ షా 65 పరుగులతో రాణించినా మిగతా ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. పుజారా 9, సూర్యకుమార్ యాదవ్ 8 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపర్చారు.
67 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ జోన్ 230 పరుగులు చేసింది. కెప్టెన్ విహారి (42) మరోసారి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
దీంతో వెస్ట్‌జోన్ ఎదుట 298 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. అనంతరం వెస్ట్‌జోన్ 222 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ పృథ్వీ షా(7), పుజారా (15), సూర్యకుమార్ (4) విఫలమయ్యారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులను సౌత్ జోన్ బౌలర్ కావేరప్ప సొంతం చేసుకున్నాడు.