బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై బహిరంగంగా అసహనం వ్యక్తం చేసిన టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌పై ఐసీసీ చర్యలు చేపట్టింది. హర్మన్ ప్రీత్ చర్యను తప్పుబడుతూ భారీగా జరిమానా విధించింది. ఆమె మ్యాచ్ ఫీజ్‌లో 75 శాతం కోత పెట్టింది. అంతేకాకుండా హర్మన్ ప్రవర్తనను లెవెల్ 2 అఫెన్స్ కింద పరిగణించిన ఐసీసీ.. ఆమెకు 4 డీ మెరిట్ పాయింట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఆన్ ఫీల్డ్‌లో దురుసు ప్రవర్తనకు 50 శాతం జరిమానా, మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా అంపైర్‌పై విమర్శలు చేసినందుకు 25 శాతం జరిమానా విధించినట్లు ఐసీసీ స్పష్టం చేసింది.
ఏం జరిగిందంటే..
మూడో వన్డేలో హర్మన్ ప్రీత్‌కౌర్ తన సహనాన్ని కోల్పోయింది. అంపైర్ నిర్ణయంపై క్రీజ్‌లోనే తన అసంతృప్తిని బయటపెట్టింది. భారత ఇన్నింగ్స్ 34 ఓవర్ వేసిన నహిదా అక్తర్ బౌలింగ్‌లో మూడో బంతిని హర్మన్‌ప్రీత్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేసింది. అయితే బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి ప్యాడ్‌కు తాకింది. బంగ్లా ఆటగాళ్లు ఎల్బీకి అప్పీల్ చేయగా..అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో అంపైర్ నిర్ణయంపై హార్మన్ ప్రీత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోపంతో రగిలిపోయి వికెట్స్‌ను బ్యాట్‌తో కొట్టింది.
ఇంతటితో ఆగని హర్మన్.. మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా బంగ్లాదేశ్ అంపైరింగ్ ప్రమాణాలపై తీవ్ర విమర్శలు చేసింది. బంగ్లాదేశ్ క్రికెట్‌లో అంపైరింగ్ లోపాలే అనుకున్నాం.. వారికి కనీస మర్యాదలు కూడా తెలియవని వ్యాఖ్యానించింది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఇండియన్ హైకమీషన్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారులు కనీసం స్వాగతం కూడా పలకలేదని హర్మన్ ప్రీత్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే బంగ్లా ఆటగాళ్లతో ఫోటోలు దిగేందుకు కూడా హర్మన్ ఆసక్త చూపకపోవడం చర్చనీయాంశమైంది. హర్మన్ ప్రవర్తించిన తీరుపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ జరిమానా విధించింది.