IND vs PAK: వర్షం కారణంగా భారత్-పాక్ మ్యాచ్ రద్దు
అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన హైవోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడింది. ఆసియా కప్ 2023లో భాగంగా జరుగుతోన్న భారత్ - పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. ఇండియా ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత మొదలైన వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియా 48.5 ఓవర్లలో 266 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ రోహిత్ శర్మ (11, 22 బంతుల్లో), విరాట్ కోహ్లీ (4, 32 బంతుల్లో), శ్రేయస్ అయ్యర్ (14, 9 బంతుల్లో) త్వరగా ఔట్ అయ్యారు. ఓపెనర్ గిల్ కూడా (10, 34 బంతుల్లో) దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ (82, 81 బంతుల్లో), హార్దిక్ పాండ్యా (87, 90 బంతుల్లో) పాక్ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ఏ మాత్రం భయపడకుండా ఒత్తిడిని జయించి సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. దాంతో భారత్ 66/4 నుంచి భారత్ 266 పరుగులకు చేరుకోగలిగింది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 4 వికెట్లు పడగొట్టగా.. నసీమ్ షా, హరీస్ రౌఫ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.