వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ ఇటీవల విడుదల చేసింది. భారత్‌లో మొత్తం 10 వేదికలలో మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే వేదికల కేటాయింపుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమ రాష్ట్రంలో వరల్డ్ కప్ మ్యాచ్‌లకు అవకాశం ఇవ్వకపోవడంతో పంబాజ్ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే దీనిపై విమర్శలు గుప్పించింది. తాజాగా పంజాబ్ క్రీడల మంత్రి గుర్మీత్ సింగ్ హయర్ bcci చైర్మన్ రోజర్ బిన్నీకి ఓ లేఖ రాశారు.
"దేశానికి లాలా అమర్నాథ్, బిషన్ సింగ్ బేడి, మొహిందర్ అమర్నాథ్, యశ్‌పాల్ శర్మ, మదన్ లాల్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, దినేశ్ మోంగియా, హర్విందర్ సింగ్, విక్రమ్ రాథోడ్, శరన్‌దీప్ సింగ్, శుభ్‌మన్ గిల్, అర్ష్‌దీప్ సింగ్.. లాంటి మేటి క్రికెటర్లను పంజాబ్ అందించింది. మొహాలీ మైదానం రెండు ప్రపంచకప్ సెమీస్‌లకు అతిథ్యం ఇచ్చింది.అలాంటి రాష్ట్రంలో వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఏర్పాటు చేయకపోవడం సరికాదు" అని లేఖలో తెలిపారు. మొహాలీలో కొన్ని మ్యాచ్‌లను కేటాయించాలని కోరారు.
వరల్డ్ కప్ షెడ్యూల్‌లో అహ్మదాబాద్‌లోని కొత్తగా నిర్మించిన నరేంద్ర మోదీ స్టేడియానికి పెద్దపీట వేశారు. ఆరంభ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్‌తో ఇండియా - పాకిస్థాన్ వంటి పలు కీలక మ్యాచ్ లు ఇక్కడే జరగనున్నాయి. ఇక హైదరాబాద్ లో మూడు మ్యాచ్ లు జరగనున్నాయి అయితే వాటిలో ఒక్కటి కూడా ఇండియా మ్యాచ్ లేదు. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఇందులో భాగంగా భారత్ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఆక్టోబర్ 15న పాక్-భారత్ మ్యాచ్ జరగనుంది.