David Warner : కొత్త సంవత్సరం వేళ.. డేవిడ్‌ వార్నర్‌ సంచలన నిర్ణయం

Byline :  Veerendra Prasad
Update: 2024-01-01 02:56 GMT

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్(37) కొత్త ఏడాది వేళ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్‌పై వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఈ తరుణమే ఆటకు ముగింపు పలకడానికి కరెక్ట్ సమయంగా తాను భావిస్తున్నట్లు తెలిపాడు. సోమవారం (David Warner)మీడియాతో మాట్లాడుతూ ... తన నిర్ణయం వల్ల కొత్త వారికి అవకాశాలు లభిస్తాయన్నాడు. అయితే 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు ఓపెనర్ అవసరమైతే జట్టు తరఫున మళ్లీ ఆడతానని తెలిపాడు. 161 వన్డేలు ఆడిన వార్నర్ 6,932 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆరవ ఆటగాడిగా నిలిచాడు.

అయితే, 2025లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు ఓపెనర్ అవసరమైతే మాత్రం కచ్చితం మళ్లీ ఆడతానని చెప్పాడు. 'నేను వన్డే క్రికెట్​కు వీడ్కోలు పలుకుతున్నా. తాజాగా భారత్​లో వరల్డ్​కప్ గెలిచాం. అది అతి పెద్ద ఘనతగా భావిస్తాను. ఇక టెస్టు, వన్డేల్లో నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. టెస్టు, వన్డే క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించడం వల్ల, వరల్డ్​వైడ్​గా ఆయా డొమెస్టిక్ లీగ్​ల్లో ఆడగలను. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఉందని నాకు తెలుసు. అయితే ఈ రెండేళ్లు నేను నాణ్యమైన క్రికెట్ ఆడితే, జట్టు కావాలనుకున్నప్పుడు అందుబాటులోనే ఉంటా' అని అన్నాడు.

వార్నర్‌ ఇప్పటికే టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈవారం పాకిస్థాన్‌తో జరగనున్న ఫైనల్‌ టెస్ట్‌ మ్యాచ్‌ అతని కెరీర్‌లో చివరిది. సిడ్నీ వేదికగా పాకిస్థాన్- ఆస్ట్రేలియా మధ్య చివరి మ్యాచ్​ జనవరి 3న ప్రారంభం కానుంది. ఇక మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ను ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా ఇప్పటికే 2-0 తేడాతో గెలుచుకుంది. టెస్టు, వన్డే క్రికెట్‌ నుంచి తప్పుకోవడం వల్ల ఫ్రాంఛైజీ లీగ్‌లలో ఆడేందుకు ఎక్కువ సమయం లభిస్తుందని పేర్కొన్నాడు. తన క్రికెట్‌ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ గ్రెగ్‌ చాపెల్‌ కీలక పాత్ర పోషించినట్లు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చడంలో వార్నర్‌ కీలక పాత్ర పోషించాడు. రెండు శతకాలు, రెండు అర్ధశతకాలతో సహా మొత్తం 528 పరుగులు చేశాడు. జట్టు నుంచి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 




Tags:    

Similar News