భారత్ దేశంలో అత్యంత ధనిక క్రికెటర్ ఎవరో తెలుసా ?

Update: 2023-07-08 11:00 GMT

భారత్ దేశంలో అత్యంత సంపన్నమైన క్రికెటర్ ఎవరంటే టక్కున సచిన్, ధోని, విరాట్, రోహిత్ శర్మ, గంగూలి లాంటి వారి పేర్లు గుర్తుకొస్తాయి. వీరిలో ఎవరో ఒకరు బాగా రిచ్ అయి ఉంటారని అంతా అనుకుంటారు. కానీ వీరికి మించిన ఓ ఆటగాడు ఉన్నాడు. అతడు వేల కోట్లకు అధిపతి. మనదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతడు రిచెస్ట్ క్రికెటర్ అనడంలో సందేహం లేదు. అతడు పేరొందిన పెద్ద క్రికెటర్ అనుకుంటే మీరు పొరపడినట్లే. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.

అతను ఎవరో కాదు గుజరాత్‌లోని బరోడాకు చెందిన మాజీ రంజీ క్రికెటర్ సమర్‌జిత్‌ రంజిత్‌సిన్హ్‌ గైక్వాడ్. మనదేశ క్రికెటర్లలో అత్యంత ధనవంతుడు. ఈయన ఆస్తి విలువ సుమారు రూ.20,000 కోట్లు దాటి ఉంటుంది. అతడు బరోడా తరఫున 1987-89 మధ్య రంజీ ట్రోఫీలో ఆరు మ్యాచ్‌లు ఆడి 119 పరుగులు చేశారు. అత్యధిక స్కోరు 65. మూడు క్యాచ్‌లు అందుకున్నారు. బరోడా క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగానూ విధులు నిర్వర్తించారు. క్రికెట్‌తో పాటు, సమర్జిత్‌సిన్హ్ గోల్ఫ్ కూడా ఆడతాడు. లక్ష్మీ విలాస్ ప్యాలెస్ కాంప్లెక్స్‌లో 10-హోల్ గోల్ఫ్ కోర్స్ మరియు క్లబ్‌హౌస్‌ను ఏర్పాటు చేశాడు.

అతని పూర్వికుల నుంచే ధనవంతులు కావడంతో సమర్‌జిత్‌ రంజిత్‌సిన్హ్‌ గైక్వాడ్‌కు వారసత్వంగా భారీగా ఆస్తులొచ్చాయి. వడోదర మహారాజు రంజిత్‌సిన్హ్‌ ప్రతాప్‌ గైక్వాడ్, శుభన్‌గిని రాజేల ఏకైక కుమారుడే సమర్‌జిత్‌ రంజిత్‌సిన్హ్‌ గైక్వాడ్‌. ఏప్రిల్ 25, 1967న జన్మించిన సమర్‌జిత్‌.. దేహ్రాదూన్‌లోని ది డూన్ స్కూల్‌లో విద్యనభ్యసించారు. అతని తండ్రి మరణించిన తర్వాత మే 2012లో మహారాజాగా సమర్జిత్‌సిన్హ్ పట్టాభిషేకం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసమైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌, మోతి బాగ్ స్టేడియం, మహారాజా ఫతే సింగ్ మ్యూజియంలు రంజిత్‌సిన్హ్‌‌కు చెందినవే. బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన అధికారిక నివాసమైన బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే లక్ష్మీ విలాస్ ప్యాలెస్ నాలుగు రెట్లు పెద్దది కావడం గమనార్హం.

లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ సమీపంలోని 600 ఎకరాలకు పైగా రియల్ ఎస్టేట్‌ భూములు కూడా ఈయనే పేరిటే ఉన్నాయి. బెనారస్‌లలో 17దేవాలయాలను, ట్రస్ట్‌లను కూడా నిర్వహిస్తున్నారు. 2002లో, సమర్జిత్‌సిన్హ్ వంకనేర్ రాష్ట్ర రాజకుటుంబానికి చెందిన రాధికారాజేతో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Tags:    

Similar News