అశ్విన్ అరుదైన రికార్డు.. అనిల్ కుంబ్లే ఏమన్నారంటే..?

Byline :  Krishna
Update: 2024-02-16 16:26 GMT

టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో 500 వికెట్ల క్లబ్లో చేరాడు. దీంతో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని మోదీ సహా పలువురు మాజీ క్రికెటర్లు అశ్విన్ను అభినందించారు. ఈ క్రమంలో భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 13ఏళ్ల కేరీర్ లోనే అశ్విన్ 500 వికెట్లు తీయడం అద్భుతమని కుంబ్లే అన్నారు. 98 మ్యాచుల్లోనే ఈ ఘనతను సాధించాడని.. దానిని 700 వికెట్ల వరకు కొనసాగించాలని ఆకాంక్షించారు. కెరీర్ తొలినాళ్ల నుంచి అంచనాలకు తగ్గట్లుగా రాణించడం అభినందనీయమని కొనియాడారు.

కాగా ఇంగ్లాండ్తో జరుగుతోన్న మూడో టెస్టులో ఓపెనర్ జాక్ క్రాలీ వికెట్ తీయడంతో అశ్విన్ 500 వికెట్ల క్లబ్లో చేరాడు. 98 టెస్టుల్లోనే అశ్విన్ 500 వికెట్లు తీశాడు. అనిల్ కుంబ్లే తర్వాత 500 వికెట్లు తీసిన రెండో భారత ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. అనిల్ కుంబ్లే 619 వికెట్లు పడగొట్టారు. కుంబ్లే 105 టెస్టుల్లో 500 వికెట్లు తీయగా.. శ్రీలంక స్పిన్ దిగ్గజం మురళీధరన్ 87 టెస్టుల్లోనే ఆ ఘనత సాధించి మొదటి స్థానంలో నిలిచాడు.

ఇక మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్ చేసింది. రోహిత్(131) , జడేజా(112) సెంచరీలతో చెలరేగడంతో 445 రన్స్ చేసింది. ఫస్ట్ టెస్ట్ ఆడిన సర్ఫరాజ్ ఖాన్ (62) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చివర్లో ధ్రువ్ జురెల్ (46), అశ్విన్ (37), బుమ్రా (26) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. అటు ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 207 రన్స్ చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ సెంచరీతో చెలరేగాడు.

Tags:    

Similar News