SA vs NED: ఎడ్వర్డ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. నెదర్లాండ్స్ భారీ స్కోరు.. సౌతాఫ్రికా అప్పుడే?
పసికూన నెదర్లాండ్స్ జట్టు పంజా విసిరింది. సౌతాఫ్రికాకు సవాల్ విసురుతూ.. భారీ స్కోర్ చేసింది. మ్యాచ్ కు ముందు వర్షం అంతరాయం కలిగించడంతో.. అంపైర్లు మ్యాచ్ ను 43 ఓవర్లను కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ కు ప్రరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. టాప్ ఆర్డర్ దారుణంగా విఫలం అయింది. ఓపెనర్లు విక్రమ్ జిత్ సింగ్ (2), మ్యాక్స్ ఓడోడ్ (18) శుభారంభాన్ని అందించలేకపోయారు. మిడిల్ ఆర్డర్ అకర్మెన్ (13), బాస్ డిలీడె (2), సిబ్రాండ్ ఎంగెల్ బ్రెచ్ట్ (19) రాణించలేకపోయారు. లోయర్ ఆర్డర్ లో వచ్చిన ఎడ్వర్డ్ (78, 69 బంతుల్లో, 10 ఫోర్లు, 1 సిక్సర్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
తర్వాత వచ్చిన బ్యాటర్లు తేజ (20), వాన్ డెర్మెర్వ్ (29, 19 బంతుల్లో), ఆర్యన్ (23, 9 బంతుల్లో) సౌతాఫ్రికా బౌలర్ల దుమ్ము దులిపారు. దీంతో నెదర్లాండ్స్ భారీ స్కోర్ చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎన్గిడీ, మార్కో జాన్సన్, రబాడా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. గెరాల్డ్, మహరాజ్ తలా ఓ వికెట్ తీసుకున్నారు. 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. ఆరంభంలోనే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు బవుమా (16), డికాక్ (20) భారీ స్కోర్ చేయలేకపోయారు. తర్వాత వచ్చిన రూసో (4), మార్క్రమ్ (1) నెదర్లాండ్స్ బౌలర్ల ముందు మోకలిల్లారు. వాన్ డెర్మెర్వ్ 2 వికెట్లు తీసుకోగా.. కోలిన్, మీకరెన్ చెరో వికెట్ పడగొట్టారు.