మానసిక సమస్యల వల్ల టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్.. దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ విషయానికి సంబంధించి ఒక వార్త.. క్రికెట్ వర్గాల్లో హల్ చల్ చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే టీ20 సిరీస్ కు తాను అందుబాటులో ఉంటానని బీసీసీఐకి చెప్పగా.. సెలక్టర్లు కావాలనే ఇషాన్ ను పరిగణంలోకి తీసుకోలేదు. ఇషాన్ ను ఎందుకు ఎంపిక చేయలేదని అభిమానులు, విమర్శకులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుండగా.. దాని వెనక ఓ బలమైన కారణం ఉందని క్రికెట్ వర్గాలు చెప్తున్నాయి. ఇషాన్ కిషన్ తన కుటుంబంతో కలిసి గడిపేందుకు మానసిక అలసట అని చెప్పి.. దుబాయ్ లో పార్టీలకు వెళ్లాడు. ఇదంతా ఓ అబద్ధం. పార్టీలకు వెళ్లేందుకు ఈ సాకు చూపాడని బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కారణంగా ఆఫ్గాన్ సిరీస్ కు అతన్ని సెలక్ట్ చేయలేదని తెలుస్తుంది.
వన్డే వరల్డ్ కప్ కన్నా ముందు నుంచే ఇషాన్ కిషన్ జట్టులో భాగం అయ్యాడు. కానీ, ప్లేయింగ్ లెవన్ లో మాత్రం చోటు దక్కలేదు. బెంచ్ కే పరిమితమైన ఇషాన్.. ఇక అప్పటి నుంచి మానసిక ఇబ్బందులకు గురయ్యాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్ తో పాటు.. సౌతాఫ్రికా సిరీస్ కు దూరంగా ఉండాలని భావించాడు. అయితే బీసీసీఐ సెలక్టర్లు మాత్రం అది పట్టించుకోక.. అతన్ని సెలక్ట్ చేసి, మళ్లీ బెంచ్ కే పరిమితం చేశారు. దాంతో కొంతకాలం జట్టుకు దూరం కాగా.. ఆఫ్ఘాన్ తో టీ20 సిరీస్ లో అందుబాటులో ఉంటానని సెలక్టర్లకు చెప్పాడు. దాన్ని పట్టించుకోని సెలక్టర్లు అతన్ని సెలక్ట్ చేయలేదు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ దేశవాళీలో ఆడకుండా.. ఐపీఎల్ 2024 కోసం ప్రీపేర్ అవుతున్నాడు. బరోడా టీంతో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న బీసీసీఐ.. జాతీయ జట్టుకు సెలక్ట్ కావాలంటే తప్పకుండా దేశవాళీలో ఆడాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ దాన్ని అతిక్రమిస్తే.. తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది.
అయినా పట్టించుకోని ఇషాన్.. ఐపీఎల్ ప్రిపరేషన్ లో బిజీ అయిపోయాడు. దీన్ని సీరియస్ గా తీసుకున్న బీసీసీఐ.. కొత్త నిబంధన తెచ్చేందుకు సిద్ధం అయింది. జాతీయ జట్టులో లేని ఆటగాడు ఐపీఎల్ లో ఆడాలంటే.. తప్పనిసరిగా కొన్ని రంజీ మ్యాచుల్లో ఆడాలని రూల్ తీసుకురానుంది. ఈ మేరకు ఇషాన్ కిషన్ ఈనెల 16 నుంచి రాజస్థాన్ తో జరిగే రంజీ మ్యాచు కోసం తన సొంత ఝార్ఖండ్ టీంతో కలవాల్సి ఉంటుంది. రంజీ పాయింట్స్ టేబుల్ లో ఝార్ఖండ్ జట్టు అట్టడుగు స్థానంలో ఉంది. అయినా లెక్క చేయని ఇషాన్.. తన స్వార్థం కోసం ఐపీఎల్ కు ప్రిపేర్ అవుతున్నాడు. గతకొంత కాలంగా ఝార్ఖండ్ మ్యాచ్‌లకు అతడు వరుసగా డుమ్మా కొట్టడం బీసీసీఐ పెద్దలకు నచ్చలేదు. అందుకే బీసీసీఐ కఠిన నిబంధనను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.