అజారుద్దీన్పై ఫిర్యాదు.. కేసు నమోదుచేసిన ఉప్పల్ పోలీసులు..
టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఉప్పల్ స్టేడియంలో సామాగ్రి కొనుగోలులో ఆయన అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల గోల్మాల్ జరిగినట్లు నిర్థారణ కావడంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సీఈఓ సునీల్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు IPC సెక్షన్ల 406,409, 420, 465, 467, 471, 120(బీ) కింద ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.
2019 - 2022 మధ్యకాలంలో అజారుద్దీన్ హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. విచారణ జరిపిన కమిటీ సభ్యులు క్రికెట్ బాల్స్, కుర్చీలు, జిమ్ ఎక్విప్మెంట్తో పాటు అగ్నిమాపక పరికరాలు కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్లు తేల్చారు. కమిటీ రిపోర్టు ఆధారంగా సీఈఓ సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.