Gautam Gambhir : యశస్వీ జైస్వాల్ ఘనతను అంత పొగడాల్సిన అవసరం లేదు: గౌతమ్ గంభీర్
(Gautam Gambhir) భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా యువ సంచలనం (Yashasvi Jaiswal)యశస్వీ జైస్వాల్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. నిన్న విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో ఇంగ్లాండ్ పై ఒంటరిపోరాటం చేసిన జైస్వాల్ డబుల్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు జైస్వాల్ ను ఆకాశానికెత్తారు. అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని, ఫ్యూచర్ స్టార్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. దీనిపై స్పందించిన గంభీర్.. తన ఆట తననుఆడుకోనివ్వాలని.. ఘనతలను ఎక్కువ చేసి చూపించడం వల్ల ప్లేయర్ పై ఒత్తిడి పెరుగుతుందని గంభీర్ హెచ్చరించాడు.
‘రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన జైస్వాల్ కు అభినందనలు. గొప్పగా ఆడుతున్నాడు. కానీ మాజీలు, అభిమానులు తన ఆట తనను ఆడుకోనివ్వండం బెటర్. ఎందుకంటే ఒక్క ఇన్నింగ్స్ తో అతన్ని ఆకాశానికి ఎత్తడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. తన సహజత్వం దెబ్బ తింటుంది. గతంలోనూ ఇలా జరిగింది. మీడియా, మాజీలు కొందరి ఘనతలను ఎక్కువ చేసి చూపించారు. వారికి ట్యాగ్ లు (బిరుదులు) ఇచ్చి ఒత్తిడి పెంచింది. దీంతో వారి అంచనాలను అందుకోలేక చాలామంది క్రికెటర్లు కెరీర్ లో ఇబ్బందుల్లో పడ్డారు’ అని గంభీర్ గుర్తుచేశాడు. రెండో టెస్టులో శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ బాగానే ఆరంభించారు. కానీ దాన్ని పెద్ద స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. వాళ్లు గాడిలో పడటానికి సమయం పడుతుంది. ఇద్దరూ నాణ్యమైన బ్యాటర్లే. వాళ్లకు తగినంత టైం ఇవ్వాలి. తప్పులు తెలుసుకుని రాణిస్తారు. గతంలోనూ ఇలానే పుంజుకున్నారు. అందుకే ఇంకా టీమిండియాకు ఆడుతున్నారని గంభీర్ చెప్పుకొచ్చాడు.