గుజరాత్లో గుబులు.. షమీని సీక్రెట్గా కలిసిన మరో ఫ్రాంచైజీ

Update: 2023-12-07 13:44 GMT

ఐపీఎల్ 2024కు ముందు గుజరాత్ టైటాన్స్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. మిగిలిన 9 ఫ్రాంచైజీలన్నీ కట్టగట్టుకుని గుజరాత్ పై పగబట్టినట్లు చేస్తున్నాయి. నిన్న ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ట్రేడ్ చేసుకోగా.. ఇవాళ ఆ జట్టుకు కీలక బౌలర్ మహమ్మద్ షమీని మరో ఫ్రాంచైజీ రహస్యంగా కలిసింది. ఈ విషయాన్ని గుజరాత్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కల్నల్ అరవిందర్ సింగ్ చెప్పారు. అందరి కన్ను గుజరాత్ జట్టుపై పడిందని.. ఏదో రకంగా తమ ఆటగాళ్లను లాగేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఒక ఫ్రాంచైజీ నేరుగా వెళ్లి ఆటగాడిని కలవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ప్రతి ఫ్రాంచైజీ అగ్రశ్రేణి ఆటగాళ్ల కోసం వెళ్లే హక్కు ఉంటుంది. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీ నేరుగా ఆటగాడిని సంప్రదించడం తప్పు. ఆటగాళ్ల ట్రేడింగ్ విషయంలో బీసీసీఐ రూల్స్ పెట్టి అమలయ్యేలా చూడాలి. బదిలీ కావాలనుకున్న ఆటగాళ్లు ముందుగా సొంత ఫ్రాంచైజీతో మాట్లాడాల’ని కల్నల్ అరవిందర్ సింగ్ తెలిపాడు.

హార్దిక్ పాండ్యా గుజరాత్ ను వీడి ముంబై జట్టులో చేరిన విషయం తెలిసిందే. దాన్నే జీర్ణించుకోలేకపోతున్న గుజరాత్ ఫ్రాంచైజి మరో కీలక ఆటగాడిని వదులుకునేందుకు సిద్దంగా లేదు. ఇలాంటి టైంలో షమీని సీక్రెట్ గా మరో ఫ్రాంచైజీ కలవడం, షమీ మనసు మారి జట్టు మారితే గుజరాత్ కు పెద్ద దెబ్బపడే అవకాశం ఉంది. గత రెండు సీజన్స్ లో గుజరాత్ బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించిన షమీ.. పోయిన సీజన్ లో 28 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్ కప్ లో కూడా అద్భుతంగా రాణించి 24 వికెట్లు తీసుకున్నాడు. ఈ క్రమంలో షమీలాంటి ఇన్ ఫామ్ ఆటగాడిని ఏ జట్టు వదులుకోవడానికి ఇష్టపడదు. ఇలాంటి టైంలో ఫ్రాంచైజికి సమాచారం లేకుండా ఆటగాడిని సీక్రెట్ గా కలవడంపై జట్టు యాజమాన్యం మండిపడుతుంది. ఈ చర్యను బీసీసీఐ తీవ్రంగా పరిగణంలోకి తీసుకోవాలని, ఆటగాళ్ల ట్రేడింగ్ విషయంలో ఓ చట్టం తీసుకురావాలని గుజరాత్ ఫ్రాంచైజి కోరారు.





Similar News