టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కుటుంబానికి ఓ మహిళ నుంచి బెదిరింపులు వచ్చాయి. తప్పుడు కేసుల్లో ఇరికిస్తానంటూ ఆమె బెదిరించడంతో పాటు భారీగా నగదును కూడా డిమాండ్ చేసింది. ఈ కేసులో గతంలో యువీ కుటుంబం వద్ద పని చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. యువరాజ్ సింగ్ సోదరుడు జోరవీర్‌సింగ్ అనారోగ్యానికి గురవ్వడంతో అతనికి కేర్ టేకర్ 2022లో హేమా కౌశిక్ అనే మహిళను నియమించారు. అయితే హేమా కౌశిక్ తీరు నచ్చకపోవడంతో యువరాజ్ తల్లి షబ్నం సింగ్ ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఇది ఆమె మనస్సులో పెట్టుకుంది.
ఇదే విషయంపై ఈ ఏడాది మే నుంచి యువరాజ్ తల్లిని ఆమె బెదిరింపులకు గురిచేసింది. తనకు రూ.40 లక్షలు ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెడతానని హెచ్చరించింది. కుటుంబం పరువుతీస్తానంటూ వాట్సాప్‌లో మెసేజ్‌లు చేసింది. యువరాజ్ తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు హేమా కౌశిక్‌ను అరెస్ట్ చేశారు. ఓ ప్లాన్ ప్రకారం అదుపులోకి తీసుకున్నారు. రూ. 5 లక్షలు ఇస్తానని యువరాజ్ సింగ్ తల్లి షబ్నం సింగ్ నమ్మించి..పథకం ప్రకారం నిందితురాలిని ఓ మాల్‌కు రప్పించారు. అక్కడే ఉన్న పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.